ఉన్న పరువు కూడా పోయింది!

 

 

 

మొన్నీమధ్య భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో ఆలోచని పెంచాయి. రెండోసారి ప్రధాని అయ్యాక దేశ ప్రజలకు ఆయన మీద గౌరవం బాగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడిన మాటలు ఆయన మీద ఉన్న కాస్తంత గౌరవాన్ని కూడా పోగొట్టేలా వున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

ప్రధానిగా తన పదేళ్ళ పదవివీకాలంలో చేసిన పొరపాట్లు, సాధించిన ఫలితాల గురించి చెప్పుకోవడానికి అన్నట్టు కాకుండా నరేంద్రమోడీని తిట్టిపోయడానికి, రాహుల్ గాంధీని మునగచెట్టు ఎక్కించడానిన్నట్టుగా మాట్లాడ్డం క్షమార్హంగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశాన్ని నిట్టనిలువుగా ముంచేసిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారం ఇవ్వండి... ఈసారి నా ప్లేసులో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేయండని చెప్పిన ఆయన తీరు విమర్శలను ఎదుర్కొంటోంది. ప్రధానమంత్రి దేశ ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నట్టు కాకుండా, ఒక ఎన్నికల సభలో మాట్లాడే రాజకీయ నాయకుడిలా ప్రధాని అప్పుడు కనిపించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



గుజరాత్ అల్లర్లు, హింసాకాండ విషయంలో కోర్టు మోడీకి క్లీన్ చిట్ ఇచ్చినా ఆ అల్లర్లకు మోడీయే కారణమంటూ ప్రధాని మాట్లాడ్డం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా భావించవచ్చని అంటున్నారు. సోనియాగాంధీ ఎలా ఆడిస్తే అలా ఆడే కీలుబొమ్మలా పేరు సంపాదించుకున్న మన్మోహన్ సింగ్ ఈ అధికార సంధ్యలో అయినా తనమీద గౌరవం పెరిగేలా మాట్లాడి వుంటే  బావుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోడీని  చూసి భయపడుతున్న కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్‌ని ఈ రకంగా కూడా వాడుకోవడం దారుణమని అంటున్నారు.

ఇప్పటికే తనకున్న మిస్టర్ క్లీన్ ఇమేజ్‌ను పూర్తిగా పోగొట్టుకుని అసమర్థ ప్రధాని అని గొప్ప గుర్తింపు సంపాదించుకున్న మన్మోహన్ సింగ్ తనను మీడియా అర్థం చేసుకోలేకపోయిందని, చరిత్రకారులైనా తనను అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించడం ఆయన బేలతనానికి నిదర్శమని విమర్శకులు అంటున్నారు. అనవసరపు ప్రెస్ మీట్లు పెట్టి జనాల్లో చులకన అయ్యే రాహుల్ గాంధీ బాటలోనే ప్రధాని మన్మోహన్ సింగ్ పయనిస్తున్నారని భావిస్తున్నారు.