జగన్ పై మందకృష్ణ ఫైర్.. రెడ్డి కులానికి ఓ న్యాయం, వేరే కులాలకు ఓ న్యాయమా?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ నిప్పులు చెరిగారు. పైకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నా... సొంత సామాజికవర్గం కోసమే పనిచేస్తున్నారని మందకృష్ణ ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు డమ్మీ పదవులు కట్టబెట్టి... ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం రెడ్డి సామాజికవర్గంతో నింపేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ ఎస్సీ, బీసీ మైనారిటీలకు అన్యాయం జరిగితే పట్టించుకోని సీఎం జగన్.... తన సొంత సామాజికవర్గానికి అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఆగమేఘాల మీద స్పందిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం మీద ప్రమాణంచేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్మోహన్ రెడ్డి... న్యాయ వ్యవస్థకు, చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఎన్ కౌంటర్ ను అసెంబ్లీ సాక్షిగా సమర్ధించమేంటని ప్రశ్నించారు. బాధితురాలు దిశ... జగన్ సామాజికవర్గం కాబట్టే నిందితుల ఎన్ కౌంటర్ ను సమర్ధించారని, అలాగే కేసీఆర్ కు హ్యాట్సాప్ చెప్పారని.... మరి హాజీపూర్ లో ముగ్గురు బీసీ బాలికలను హత్యాచారం చేసి మృతదేహాలను బావిలో పూడ్చేసిన శ్రీనివాస్ రెడ్డిని.... అలాగే జడ్చర్లలో బాలికపై అత్యాచారం చేసిన చంపేసిన నవీన్ రెడ్డిని ఎందుకు ఎన్ కౌంటర్ చేయమని కోరలేదని మందకృష్ణ నిలదీశారు. ఒక రెడ్డిని చంపిన నలుగుర్ని ఎన్ కౌంటర్ చేసినప్పుడు... నలుగురు అమ్మాయిలను చంపిన మరో రెడ్డికి అదే శిక్ష ఎందుకు వేయమని కోరడం లేదని మందకృష్ణ ప్రశ్నించారు. ఇక, వైఎస్ హయాంలో 11మంది గిరిజన మహిళలపై పోలీసులు అత్యాచారానికి పాల్పడి చంపేసినా.... ఆయేషామీరాను రేప్ అండ్ మర్డర్ చేసినా... ఇప్పటివరకూ న్యాయం జరగలేదని మందకృష్ణ గుర్తుచేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్.... ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... ఇద్దరూ కూడా తమ తమ సొంత సామాజికవర్గాలకు అన్యాయం జరిగితే ఒకలా... ఇతర సామాజిక వర్గాలకు అన్యాయం జరిగితే మరోలా స్పందిస్తున్నారని మందకృష్ణ ఆరోపించారు. అయినా, ఆర్ధిక నేరగాళ్లపై వేగంగా న్యాయ విచారణ జరిపించి, నేరం రుజువైతే ఉరిశిక్ష విధించేవిధంగా వైసీపీ ప్రభుత్వం చట్టం చేయగలదా అంటూ మందకృష్ణ ప్రశ్నించారు. ఒకవేళ అలాంటి చట్టాన్ని కేంద్రం చేస్తే సమర్ధించే దమ్ము జగన్ కి ఉందా అంటూ మందకృష్ణ నిలదీశారు.