ఆంధ్రా ‘కురుక్షేత్రం’లో కులాల పద్మవ్యూహం పన్నుతున్నారా?

 

ఏపీలో అధికార టీడీపీ పాలనకి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయా? అవుననే అనిపిస్తోంది పరిస్థితులు చూస్తోంటే! మరీ ముఖ్యంగా, కులాల కుంపట్లు రాజేయాలని కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తోన్నట్టు ఇట్టే తెలిసిపోతోంది. చాలా రోజులుగా కాపుల రిజర్వేషన్ అంశం వివాదంలో వుండగానే కొత్తగా మంద కృష్ణ మాదిగ రంగంలోకి దిగారు. కురుక్షేత్రం అంటూ రణరంగం సృష్టించారు. అసలు వున్నట్టుండీ కృష్ణ మాదిగ ఎక్కడ్నుంచీ వచ్చినట్టు? ఎమ్మార్పీఎస్ హఠాత్ ఉద్యమానికి కారణం ఏంటి?

 

తెలంగాణ , ఏపీ విడిపోయాక ఆంద్రా ఓట్లర్లు చంద్రబాబు సీనియారిటికీ పట్టం కట్టారు. ఆయనైతేనే అన్ని వర్గాల్ని, అన్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేయగలరని, కొత్త రాష్ట్రాన్ని వడివడిగా అడుగులు వేయిస్తారని భావించారు. కాని, మూడేళ్లు పూర్తి అయ్యేలోపే ప్రతిపక్షాలు, వాటికి అనుకూలంగా వున్న శక్తులు అధికారం కోసం తహతహ లాడిపోతున్నాయి. ప్రతిపక్ష నేతైన జగన్ పబ్లిగ్గానే నేనే నెక్ట్స్ సీఎం అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. మరో వైపు ఆయనకు పరిస్థితులు అనుకూలించే విధంగా కాపు రిజర్వేషన్లు అంటూ ముద్రగడ లాంటి నేతలు జనాన్ని రోడ్లపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

 

కాపుల నిరసనలో భాగంగా ఓ ట్రైన్ కు నిప్పు పెట్టడం ఆ మధ్య తీవ్ర కలకలం రేపింది. చివరకు, అది ప్రభుత్వంపై కోపంతో వున్న జనం చేసిన పనేం కాదని తేలింది. కుట్ర పూరితంగా విధ్వంసానికి దిగారని రిపోర్ట్ వచ్చింది. అంటే కాపు రిజర్వేషన్ అని పైకి చెబుతోన్న లోలోన ప్రభుత్వాన్ని అస్థిర పరచటమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది!

 

ఇక మొన్నీ మధ్యే ఐవైఆర్ ఉదంతం కూడా పెద్ద వివాదంగా మారింది. నిజానికి ఆయన ప్రభుత్వ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయటం చంద్రబాబు చర్య తీసుకునేలా చేసింది. ఆయనని తొలగించిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో మరో బ్రాహ్మణుడ్నే కూర్చోబెట్టారు. ఇందులో ఎలాంటి కుల పరమైన దురుద్దేశమూ ప్రభుత్వానికి లేదు. కాని,చాలా మంది మీడియాలో, సోషల్ మీడియాలో చంద్రబాబుని బ్రాహ్మణ వ్యతిరేకిగా ముద్రవేసే ప్రయత్నం చేశారు! వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణులు టీడీపీ వెంట వుండవద్దని పిలుపులు ఇచ్చేదాకా వ్యవహారం వెళ్లింది!

 

తాజాగా మంద కృష్ణ మాదిగ కురుక్షేత్రం మీటింగ్ కూడా ఉన్నట్టుండీ హాట్ డిబేట్ గా మారింది. రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత మంద కృష్ణ తెలంగాణలోనే పెద్దగా యాక్టివ్ గా వుండటం లేదు. ఒకప్పటిలా ఉద్యమాలు చేయటం, సభలు,సమావేశాలు నిర్వహించటం బాగా తగ్గింది. కాని, ఆయన ఉన్నట్టుండీ గుంటూరులో మీటింగ్ అంటు నిర్ణయం తీసుకున్నారు! పర్మిషన్ లేకున్నా నిర్వహించి తీరుతాం అంటూ ప్రభుత్వాన్ని మాదిగల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు! అసలు మంద కృష్ణ , ఎమ్మార్పీఎస్ ల డిమాండ్స్ ఏంటన్నది పక్కన పెడితే హఠాత్తుగా ఉద్యమం రాజుకోవటం కాస్త ఆలోచించాల్సిన అంశం…

 

నవ్యాంధ్ర తొలి సీఎంగా మూడేళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు ఇక ఇప్పుడు కులాల వారిగా పైకి లేస్తోన్న నిరసనల్ని, అసంతృప్తుల్ని ఓ కంట కనిపెట్టాలి. లేదంటే, రానున్న ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఖచ్చితంగా వుంటాయి. ఎందుకంటే, మన దేశంలో ఇప్పటికీ ఓటర్లు అభివృద్ధి నినాదం కంటే కుల పరమైన అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కాబట్టి అధికారంలోని వారు ఎవరైనా కుల కోణంలో జరిగే కుట్రల్ని ఎప్పటికప్పుడు ఛేదిస్తూ వుండాలి…