జేమ్స్ బాండ్ స్వంత దేశానికి మైండ్ జామ్ చేసేస్తోన్న ఉగ్రవాదం!

 

మన భాషలో చెప్పుకోవాలంటే… హైద్రాబాద్ కి బంజారాహిల్స్ , జూబ్లిహిల్స్ ఎలాంటివో… ప్రపంచానికి యూరప్, అమెరికా అలాంటివి! అందమైన ప్రదేశాలు, అద్భుతమైన అభివృద్ధి, ఉత్సాహం, ఉల్లాసం వగైరా వగైరా. కానీ, అన్నిటికంటే ముఖ్యమైంది భద్రత! యూరోప్ లో , అమెరికాలో వుండే భద్రత మరెక్కడా వుండదని అందరూ భావించే వారు. అందుకే, అమెరికన్ సీఐఏ, ఎఫ్బీఐ, బ్రిటీష్ సీక్రెట్ సర్వీసెస్ ఇంటలిజెన్స్, స్కాట్లాండ్ యార్డ్ వంటివన్నీ వాల్డ్ ఫేమస్ అయ్యాయి. హాలీవుడ్ సినిమాలకు అతి పెద్ద ముడి సరుకు కూడా అయ్యాయి! కాని, ఇప్పుడు ఐసిస్ , ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థల హింసోన్మాదులు ది గ్రేట్ బ్రిటీష్ ఏజెంట్ జేమ్స్ బాండ్ నే వెక్కిరిస్తున్నారు. దాడి మీద దాడి చేస్తూ లండన్, మాంచెస్టర్ అన్న తేడా లేకుండా తెల్ల వాళ్ల గుండెల్లో నిద్దురపోతున్నారు. కేవలం బ్రిటనే కాదు … ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, స్విట్జర్లాండ్ అన్నీ గడగడ వణికిపోతున్నాయి!

 

సోమవారం మరోసారి బ్రిటన్ ఉలిక్కిపడింది. మాంచెస్టర్ నగరం బిక్క చచ్చిపోయింది. లండన్ లో ఆ మధ్య జరిగిన ఉగ్ర దాడి మరవక ముందే మరో ఇంగ్లీష్ సిటీలో మృత్యు సంగీతం మార్మోగింది. మాంచెస్టర్ ఎరీనాలో అమెరికన్ పాప్ సింగర్ అరియానా గ్రాండే షో ముగియగానే ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఇది నిజంగా బ్రిటన్ కు ఒళ్లు గగుర్పొడిచే పరిణామం. ఎందుకంటే, ఇంత వరకూ యూరప్ లో ఆత్మాహుతి దాడులు చాలా తక్కువ. సిరియా, లిబియా, నైజీరియా, పాకిస్తాన్ లాంటి వెనుకబడ్డ దేశాల్లోనే జిహాదీలు ఆత్మాహుతులకు పాల్పడుతుంటారు. కాని, ఈసారి యూరప్ మొత్తానికి పెద్ద దిక్కైన బ్రిటన్ గుండెలో మానవ బాంబు పేలింది! ఇది రాను రాను క్షిణిస్తున్న అగ్రరాజ్యాల భద్రతా వ్యవస్థకి సంకేతం! అరికట్టలేని ఉన్మాద ఉగ్రవాద విలయానికి సూచన!

 

ఆధునిక ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న ఉగ్రవాదం ఎలా మొదలైంది? అదొక పెద్ద చర్చ! ఒక్క మాటలో చెప్పుకుంటే మాత్రం ఉగ్రవాదానికి మూలాలు అమెరికా నేతృత్వంలోని బ్రిటన్ లాంటి దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న నాటో కూటమిలో వున్నాయి. తమకు బిజినెస్ కావాలంటే ఆయుధాలు, బాంబులు అమ్మటం, అవసరం తీరగానే ఉగ్రవాదుల ఏరివేత అంటూ ముస్లిమ్ దేశాలపై దాడులు చేయటం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలకు పరిపాటి. ఇప్పుడు ఆ డేంజరస్ గేమ్ కి అసలు ఫలాల్నే పాశ్చాత్య దేశాలు అనుభవిస్తున్నాయి!

 

ఉగ్రవాదం విషయంలో పాశ్చాత్య దేశాల ద్వంద్వ నీతే కాదు మరో నిర్లక్ష్యమూ సామాన్య జనం కొంపలు ముంచుతోంది. ఉగ్రవాద పీడిత దేశాల నుంచీ వలస వచ్చే లక్షలాది జనాన్ని యూరోపియన్ దేశాలు అడ్డు అదుపు లేకుండా స్వీకరించేశాయి. అది మంచి విషయమే కావచ్చు. కాని, సామాన్య శరణార్థుల మధ్యలోనే మేక వన్నె ఉగ్రవాదులు కూడా యూరోప్ లో ప్రవేశించారు. ఈ మధ్య జరుగుతోన్న వరుస దాడులకి ఇదే కారణమంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. ముస్లిమ్ దేశాల నుంచీ వలస వచ్చే వారిని తమ మతం కారణంగా తిరస్కరించాల్సిన అవసరం లేదు. కాని, అదే సమయంలో యూరోపియన్ సెక్యులర్ నేతలు తమ స్వంత ప్రజల భద్రత కూడా దృష్టిలో పెట్టుకోవాలి. శరణార్థులు అందరూ శరణమనే వస్తున్నారా? లేక రణానికి కుట్ర చేసేందుకు దేశంలో దూరుతున్నారా? గట్టి నిఘా పెట్టి నిర్ధారించుకోవాలి! నిజమైన ఉగ్ర దాడులు అరికట్టడం జేమ్స్ బాండ్ సినిమాలు తీసినంత తేలిక కాదు! దశాబ్దాలుగా ఉగ్రవాదానికి బలైపోతోన్న భారత్ లాంటి దేశాలు అదే నిరూపిస్తున్నాయి. ఇండియా, ఇజ్రాయిల్ లాంటి వాటి నుంచీ ఇప్పుడు యూరోప్, అమెరికా ఎంతో నేర్చుకోవాల్సి వుంది…