ఒకే ముహూర్తానికి ప్రియురాలిని, పెద్దలు కుదిర్చిన అమ్మాయిని పెళ్లాడిన యువకుడు

ఒక పక్క కరోనా కలకలం. మరో పక్క లాక్ డౌన్ కష్టాలు. ఈ పరిస్థితుల్లో కూడా ఆ ఊళ్ళో మాత్రం పెళ్లి చాలా హ్యాపీగా సాఫీగా సాగిపోయింది. ఐతే ఇక్కడ సాఫీగా అని ఎందుకంటున్నాం అంటే పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు తో పాటు ఇద్దరు పెళ్లి కుమార్తెలు కూడా ఉన్నారు. అవును మీరు చదువుతున్నది నిజంగా నిజమే. అది కూడా అటు పెళ్లి కొడుకు ఇటు పెళ్లి కుమార్తెలు అందరు కూడా హ్యాపీగా ఉండడం ఇక్కడ విశేషం. 

ఐతే ఈ పెళ్లి కథా కమామిషు ఏంటంటే మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాకు చెందిన కేరియా గ్రామంలో సందీప్ అనే గిరిజన యువకుడు ఒకే మండపం లో అదే పెళ్లి పీటల పై ఒకే సారి ఇద్దరు అమ్మాయిల తో కలిసి ఏడడుగులు నడిచాడు. దీనికి కారణం సందీప్ భోపాల్ లో చదువుకునే సమయంలో హోషంగాబాద్ కు చెందిన యువతి తో లవ్ లో పడ్డాడు. ఆ యువతి కూడా అతడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఐతే ఈ ప్రేమ దోమ నచ్చని పెద్దలు మరో అమ్మాయితో సందీప్ పెళ్లి డిసైడ్ చేసారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి ముహూర్తం టైం కు నా ప్రియుడు తొనే జీవితం అంటూ ప్రియురాలు ఫ్యామిలీ తో సహా ఎంట్రీ ఇచ్చింది. ఒక పక్క పెద్దలు కుదిర్చిన అమ్మాయి.. మరో పక్క ప్రేమించిన ప్రియురాలు. దీంతో మూడు కుటుంబాలు ఊరి పెద్దల వద్దకు పంచాయతీ తీర్చమని వెళ్లాయి. అక్కడ పంచాయతీ పెద్దలు ఇద్దరు అమ్మాయిలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు. ఏదేమైనా సరే అతడినే పెళ్లి చేసుకుంటామని ఇద్దరు పట్టు పట్టారు. అంతే కాకుండా ఇద్దరు కలిసి అతనితో కాపురం చేస్తామని చెప్పడంతో అటు కుటుంబ పెద్దలు ఇటు పంచాయతీలోని పెద్దలు కూడా దీని వల్ల ముందు ముందు ఇబ్బందులు ఎదురవుతాయని నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వారిద్దరూ ససేమిరా అన్నారు. దీంతో ఇక చేసేది ఏమిలేక పెద్దలందరూ రాజీ పడడంతో అదే మండపంలో ముందుగా నిర్ణయించిన ముహుర్తానికే ఇద్దరు యువతులతో సందీప్ కు పెళ్లి చేశారు.