'థర్డ్ ఫ్రంట్ కన్వీనర్' గా చంద్రబాబు!! దేశంలో చక్రం తిప్పుతారా?

 

జనవరి 19 న కోల్‌కతాలో జరిగే భారీ బహిరంగ సభలో థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ప్రకటించేందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగం సిద్ధం చేశారు. గతంలో రెండుసార్లు థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ గా పనిచేసిన అనుభవం చంద్రబాబుకి ఉన్నందున మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుకి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నందున  చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ గా మరొకసారి పనిచేయాలని మమతా బెనర్జీ కోరనున్నారు. జనవరి 19న కలకత్తాలో 10 లక్షల మందితో అతి పెద్ద ర్యాలీకి తృణముల్ కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది. రంగస్థలం మీదకు రమ్మని మమతా బెనర్జీ లేఖ రాసారు.

ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరిలో కోల్‌కతాలో తాము నిర్వహించబోయే భారీ ప్రదర్శనకు హాజరుకావాలని కోరుతూ చంద్రబాబుకు మమతా బెనర్జీ లేఖ రాశారు. 2019 పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల సంఘటిత శక్తిని ఈ ర్యాలీ ద్వారా నిరూపించాల్సిన అవసరం ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన, ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. లౌకికవాదాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకేతాటిపైకి వచ్చి పోరాడేందుకు ఇది మంచి వేదికవుతుంది. దేశ చరిత్రలో ఎన్నో కీలక సమావేశాలకు సాక్ష్యంగా నిలిచిన కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ వద్ద ఈ ప్రదర్శనను ప్రారంభిస్తాం. ఇక్కడి నుంచే అత్యంత కీలకమైన అంశాలపై మనం స్వరం వినిపిద్దాం. ఈ ప్రదర్శనలో మీరు పాల్గొనడం దేశ ఐక్యతను, సమైక్యతను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నాను’ అని లేఖలో వివరించారు.

కోల్‌కతాలో జరిగే భారీ బహిరంగ సభలో థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ గా  చంద్రబాబును ప్రకటించేందుకు మమతా బెనర్జీ దేశ వ్యాప్తంగా అన్ని పార్టీ నాయకులతో సంప్రదించారు. గతంలో దేశరాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు.. ఇప్పుడసలే ఏపీకి అన్యాయం చేసిందని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో 'థర్డ్ ఫ్రంట్ కన్వీనర్' గా చంద్రబాబుని ప్రకటిస్తే దేశరాజకీయాల్లో ఎలా చక్రం తిప్పుతారో చూడాలి మరి.