మమతకు చెలగాటం… బెంగాల్ కు ప్రాణ సంకటం!

 

మీరు రోజూ జాతీయ వార్తలు ఫాలో అయ్యేవారైతే మీకు గో సంరక్షకుల దాడిలో మరణించిన వారి గురించి తెలుస్తూనే వుంటుంది! ఇలాంటి దాడుల్లో ముస్లిమ్ లో, దళితులో ఒకరిద్దరు చనిపోతుంటారు విషాదంగా! అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే! తీవ్రంగా పోరాడి అంతం చేయాల్సిన విషయమే! అందుకే, మన దేశంలోని చాలా మంది సెక్యులర్ ఉద్యమకారులు, మేధావులు వగైరా వగైరా వెంటనే రంగంలోకి దిగుతారు. ఈ మధ్యే దేశ వ్యప్తంగా నాట్ ఇన్ మై నేమ్ అంటూ రోడ్ల మీదకి వచ్చారు వందలాది మంది. గో సంరక్షణ పేరుతో హత్యలు చేయోద్దని వారు నినదించారు. చివరకు, మోదీ కూడా గో సంరక్షణ లాగే మనిషి ప్రాణం కూడా అమూల్యమైందని చీవాట్లు పెట్టారు హిందూ సంస్థల కార్యకర్తల్ని! ఇదంతా బాగానే వుంది కాని… గో సంరక్షకుల హత్యల్ని ఖండించిన వారు బెంగాల్ లో జరుగుతోన్న అల్లర్లు, హింస గురించి ఎందుకు మాట్లాడరు?

 

బెంగాల్ లో మత కలహాలు జరుగుతున్నాయని మీకు తెలుసా? అసలీ విషయాన్ని జాతీయ మీడియా పెద్ద అంశంగా పరిగణించటం లేదు. జాతీయ మీడియానే జనంలోకి తీసుకురాని అంశాన్ని తెలుగు మీడియా వంటి ప్రాంతీయ ఛానల్స్, పేపర్లు మాట్లాడతాయా? మాట్లడవు! కాని, కేవలం ఓ మైనర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ కు వ్యతిరేకంగా బెంగాల్ లో అల్లర్లు కొనసాగుతున్నాయి. ఆ టీనేజ్ అబ్బాయిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పటికీ … రాష్ట్ర రాజధాని కోల్ కతాకు అరవై కిలో మీటర్ల దూరం కూడా లేని ఉత్తర 24 పరగణాల జిల్లాలో అరాచకం రాజ్యమేలుతోంది! అతివాద మైనార్టీ మూకలు ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్తుల్ని ఇష్టానుసారం తగలబెడుతున్నాయి. బషిహ్రత్ అనే ప్రాంతంలో హిందువులు బిక్కుబిక్కుమనే స్థితి నెలకొంది! ఇంత జరుగుతోన్నాఇంగ్లీష్, హిందీ ఛానల్స్, పేపర్లు చిన్న చిన్న వార్తా కథనాలతో సరిపెడుతున్నాయి తప్ప ఏ మాత్రం హడావిడి చేయటం లేదు…

 

బెంగాల్ లో జరుగుతోన్న దానికి అక్కడి ముస్లిమ్ లని బాధ్యులని చేయటం ఎంత మాత్రం సరికాదు. మిగతా అన్ని రాష్ట్రల్లోని ముస్లిమ్ లలాగే వారు కూడా చాలా వరకూ పేదవారే. వారు పనిగట్టుకుని హింసాకాండకి దిగుతున్నారనుకోవటం మూర్ఖత్వం. కాని, జరుగుతోన్నది కరుడుగట్టిన రాజకీయ క్రీడ. మోదీ, అమిత్ షాల పేర్లు చెబితే భగ్గున మండిపోతోన్న మమతా బెనర్జీ అంతకంతకూ సెక్యులర్ మూర్తిగా దర్శనమిచ్చే పనిలో పడిపోయారు. ఆ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా హిందు, ముస్లిమ్ గొడవలు చోటు చేసుకుంటున్నాయి బెంగాల్ లో. ఆ మధ్య మాల్డా అనే ప్రాంతంలో తృణమూల్ అండ వున్న అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి. తరువాత శ్రీరామ నవమి ఉత్సవాలప్పుడు, వసంత నవరాత్రి పూజలప్పుడు మమత సర్కార్ హిందువులపై తీవ్ర అంక్షలు విధించి చెడ్డ పేరు తెచ్చుకుంది. దుర్గా, రామనవమి విజయ యాత్రల కోసం బెంగాల్ హిందువులు కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇలా పదే పదే బీజేపి, ఆరెస్సెస్ మీద కోపం, చిరాకు వంటివన్నీ బెంగాల్ హిందువుల మీద ప్రదర్శిస్తోంది అక్కడి సీఎం!

 

తాజా బషిహ్రత్ అల్లర్ల నేపథ్యంలో కూడా మమత బెనర్జీ ప్రవర్తన ఆక్షేపణీయంగా వుంది. రోజుల తరబడి ఆస్తుల నష్టం, శాంతి భద్రతల సమస్య కొనసాగుతుంటే… ఆమె తనతో గవర్నర్ బీజేపి ఏజెంట్ లా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు చేస్తోంది. అది కేవలం రాజకీయ డ్రామా అన్నది అందరికీ తెలిసిందే. గవర్నర్ బీజేపి ఆజ్ఞాలకి అనుగుణంగా వ్యవహరించటం పెద్ద వింతేం కాదు మన దేశంలో. కాంగ్రెస్ వున్నా గవర్నర్లు అలాగే ప్రవర్తిస్తారు. కాని, పదే పదే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగి, ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంటే అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి బాధ్యతే. దాన్నుంచి జనం దృష్టిని తప్పించటానికి గవర్నర్ ని అడ్డుపెట్టుకోవటం ముందు ముందు కోలుకోలోని ఎన్నికల ఫలితాల్ని ఇస్తుంది. మమతా బెనర్జీ ఇప్పటికైనా ముస్లిమ్, హిందూ ఓటు బ్యాంకులుగా కాకుండా జనం అందర్నీ ఒక్కటిగా చూసే నిజమైన సెక్యులరిజమ్ అలవాటు చేసుకోవాలి. అదే సమయంలో మీడియా, మేదావులు కూడా బెంగాల్ లో జరుగుతోన్న అసహజ పరిణామాల్ని బయటి ప్రపంచానికి స్పష్టంగా తెలియజెప్పాలి…