తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి గెలుపుపై అనుమానాలు

 

అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎవరో తెలీదు కానీ సీఎం అభ్యర్థుల రేసు లిస్ట్ లో చాలామంది పేర్లు వినిపిస్తాయి. నిన్న తెలంగాణలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎప్పటిలాగానే సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో సీఎం అభ్యర్థి ఇతనే అంటూ చాలా మంది నేతల పేర్లు వినిపించాయి. వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఒకరు. కేసీఆర్ 2014 ఎన్నికలకు ముందు దళితుడిని సీఎం చేస్తామని అన్నారు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. దీంతో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలని భావిస్తోదంటూ వార్తలు వినిపించాయి. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, దళిత నేతని సీఎం చేయాలనుకుంటే భట్టి విక్రమార్కకు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ వార్తలు, ఊహల్లో నిజమెంతో తెలీదు కానీ ఇప్పుడు భట్టి గురించి ఒక షాకింగ్ చర్చ జరుగుతుంది. అదేంటంటే కొందరు భట్టి గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

భట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మధిర నుంచి బరిలోకి దిగి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయనకు పోటీగా టీఆర్ఎస్ తరుపున కమలరాజ్, బిఎల్ఎఫ్ తరుపున రాంబాబు బరిలో ఉన్నారు. కూటమికి మొదటి నుంచి భట్టి గెలుపు మీద ఎలాంటి అనుమానాలు లేవు. అయితే టీఆర్ఎస్.. కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిలో మధిర ఒకటి. టీఆర్ఎస్ భట్టిని ఎలాగైనా ఓడించి మధిరలో పాగా వేయాలనుకుంది. ఆ బాధ్యతను ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు. దానికి తగ్గట్టే ఆయన మధిరలో తిష్ట వేసి కమలరాజ్ గెలుపుకి పావులు కదిపినట్టు తెలుస్తోంది. అయినా కూటమి నేతలు భట్టి విజయంపై ధీమాగా ఉన్నారు. అయితే నిన్న ఎన్నికలు జరిగిన సాయంత్రం నుంచి మధిర నియోజకవర్గంలో భట్టి గెలుపు కష్టమే అంటూ చర్చలు మొదలయ్యాయి.

మధిరలో పొంగులేటి వ్యూహాలు ఫలించడమే కాకుండా, కొన్ని సామజిక వర్గాల ఓట్లు కూడా భట్టికి పడలేదని తెలుస్తోంది. మరోవైపు బిఎల్ఎఫ్ అభ్యర్థి రాంబాబు కూడా భట్టి ఓటు బ్యాంకుకి బాగా గండి కొట్టారు అంటున్నారు. ఇలా పలు కారణాలు భట్టి గెలుపుకి అడ్డుకట్టగా మారాయి అంటున్నారు. అయితే కూటమి నేతలు మాత్రం ఈ మాటలు కొట్టిపారేస్తున్నారు. 2014 ఎన్నికల్లో కూడా భట్టి గెలుపు కష్టమన్నారు. కానీ గెలిచారు. ఇప్పుడు టీడీపీ ఓటు బ్యాంకు తోడైంది. భట్టి ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తారు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.