9ఏళ్లు బెయిల్ రాకుండా ఆపారు! నేరం మాత్రం ఋజువు చేయలేదు!

మన దేశంలో అధికారంలోని ప్రభుత్వాలకు యథేచ్ఛగా ఉపయోగపడే వ్యవస్థలు ఏవైనా వున్నాయంటే… అవి ప్రధానంగా దర్యాప్తు సంస్థలే! ఒక్కసారి అసెంబ్లీలోనో, పార్లమెంట్లోనో మెజార్జీ సంపాదిస్తే ఇక అయిదేళ్లు సదరు ప్రభుత్వానికి సీబీఐ, సీఐడీ లాంటి దర్యాప్తు సంస్థలు బానిసలే! అంతలా దయనీయ స్థితి ఏర్పడింది గత డెబ్బై ఏళ్ల కాలంలో! ఇందుకు కాంగ్రెస్, బీజేపి, ఇతర ప్రాంతీయ పార్టీలు, కమ్యూనిస్టులు అన్న తేడా లేదు! ఎవరు అధికార పీఠంపై వున్నా దర్యాప్తు సంస్థలకు చేతి నిండా పనే! అఫ్ కోర్స్, అది ఏ విధంగానూ జనానికి, దేశానికి ఉపయోగపడని కక్ష సాధింపు ఘనకార్యం…

 

సీబీఐ, సీఐడీ, కొత్తగా ఎన్ఐఏ … ఇలా ప్రతీ సంస్థని మన పాలకులు వాడేసుకుంటున్నారు. ఇందుకు సుప్రీమ్ బెయిల్ మంజూరు చేసిన కల్నల్ పురోహిత్ వ్యవహారమే నిదర్శనం. ఆయనతో పాటూ అభినవ్ భారత్ సంస్థ నడిపిన సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఏళ్ల తరబడి జైల్లో మగ్గారు. వారు నిజంగా మాలేగావ్ పేలుళ్లు జరిపారా? ఇంత వరకూ జాతీయ దర్యాప్తు సంస్థ వద్ద గట్టి సాక్ష్యాధారాలు లేవు. వుంటే త్వరితగతిన ఛార్జీషీట్లు వేసి నిందితులకి శిక్షలు పడేలా చేయవచ్చు కదా? అలా జరగలేదు. ఇప్పటికి 9ఏళ్లుగా సాధ్వీ, కల్నల్ పురోహిత్ కటకటాల వెనక మగ్గారు. దీని వెనుక కారణం ఏంటో ఎవరైనా ఇట్టే చెప్పయగలరు! గత యూపీఏ ప్రభుత్వం హిందూ ఉగ్రవాదం అన్న వాదన , చర్చ కొనసాగుతూ వుండటానికి మాలేగావ్ కేసు వాడుకుంది. అందు కోసం సాధ్వీ, పురోహిత్ ల జీవిత కాలంలో దాదాపు దశాబ్ద కాలం నిర్ధాక్షిణ్యంగా వృథా చేయించింది!

 

హిందూ ఉగ్రవాదం లేదనీ, సాధ్వీ, కల్నల్ లాంటి వారంతా అమాయకులనీ ఎవరూ వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. నిజంగా అమాయకుల ప్రాణాలు బలికావటానికి వాళ్లు కారణమైతే కఠినమైన శిక్షలు విధించాల్సిందే. కాని, తప్పు చేసిన వార్ని కోర్టులో దోషులుగా నిరూపించి, శిక్షలు పడేలా చేయటానికి ఎలాంటి కాలపరిమితీ లేదు మన దేశంలో! అదే పెద్ద విడ్డూరం! తాజాగా సుప్రీమ్ లో బెయిల్ పొందిన పురోహిత్ కేసులో… ఆయన తరుఫు లాయర్ హరీష్ సాల్వే వాదన వినిపిస్తూ ఓ మాట అన్నారు. పురోహిత్ నిజంగా తప్పు చేసినా… ఆయనకు పడే శిక్ష 7ఏళ్లు. కాని, ఆయన ఇప్పటికే 9ఏళ్లు జైల్లో మగ్గారు. మరి ఆ రెండేళ్లు ఎవరు తిరగిస్తారు? అసలు దోషులే కాదని నిరూపితమైతే మొత్తం తొమ్మిదేళ్లు ఎవరు తెచ్చిస్తారు? వాళ్ల కుటుంబ సభ్యుల మానసిక వేదన సంగతేంటి? ఏ ప్రశ్నకూ సమాధానం లేదు!

 

కల్నల్ పురోహిత్, సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ల ఉగ్రవాద సంబంధమైన కేసే కాదు. ఆయేషా మీరా కేసులో సత్యం బాబు లాంటి సామాన్య అమాయకుడి పరిస్థితి కూడా అంతే! ఏ తప్పు చేయకున్నా నరకం అనుభవించాడు అతను. కారణం… మళ్లీ మన దర్యాప్తు సంస్థల అమానుషమైన స్థితే! ఇది ఖచ్చితంగా మారాల్సిన అంశం! దేశంలోని ప్రతీ కేసు నిర్ధిష్ట కాలంలో పూర్తై దోషులకు శిక్ష పడాలి. దర్యాప్తు సంస్థల్ని అధికారంలోని ప్రభుత్వాలు దుర్వినియోగం చేయకుండా రూల్స్ రావాలి!