మంటల్లో కాలి మసయిన 24 మంది చిన్నారులు

ఉన్న ఒక్క దారి కూడా మంటలతో మూసుకు పోవడంతో, మలేసియాలోని ఒక ముస్లిం స్కూల్ లో దాదాపు 24 మంచి చిన్నారులు అగ్నికి ఆహుతై ప్రాణాలు విడిచారు. ఆ గదికి రెండు దార్లు ఉన్నప్పటికీ ఒక దారిని గోడతో మూసేసారు. అగ్నిమాపక సిబ్బంది మరియు సాక్షులు చెప్పిన కథనం ప్రకారం, మొదట పిల్లలు సహాయం కోసం కిటికీలోంచి చేతులు బయటపెట్టి అర్ధించారు... కానీ, చుట్టుపక్కల వారు నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండి పోయారు. తర్వాత చిన్నారుల దేహాలు అగ్నికి దహింపబడి... మృతదేహాలు గదిలోని ఒక మూలలో పడి ఉండిపోయాయి. పాఠశాల ఉద్యోగి ఆరిఫ్ మవార్డి మొదట ఉరుము శబ్దంగా భావించి మేల్కొన్నానని... కానీ, అవి జనాల అరుపులని తర్వాత తెలుసుకున్నానని అన్నారు. 


ప్రమాద విషయం తెలుసుకొని అగ్నిమాపక సిబ్బంది ఉదయం 5:41 గంటలకు అక్కడికి చేరుకున్నారు. మంటలార్పడానికి వారికి ఒక గంట సమయం పట్టినట్లు కౌలాలంపూర్ పోలీస్ చీఫ్ అమర్ సింగ్ చెప్పారు. అక్కడ కనీసం 24 మృతదేహాలు ఉన్నాయని, వాటిలో 13 నుండి 17 ఏళ్ళ మధ్య బాలురు 22 మంది మరియు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. మా ఊహ ప్రకారం, చిన్నారులంతా ఊపిరాడక చనిపోయారని వివరణ ఇచ్చారు. 14 ఇతర విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు రక్షించబడ్డారని, అందులో ఆరుగురు క్లిష్ట పరిస్థితిలో ఆస్పత్రిలో ఉన్నారని సింగ్ అన్నారు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వాళ్ళ ఈ దుర్ఘటన జరిగి ఉండొచ్చని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనని దగ్గరి నుండి చూసిన వాళ్ళు తాము ఇంకా షాక్ నుండి తేరుకోలేక పోతున్నామని అన్నారు.