గాంధీ హత్య వెనుక గాడ్సే ఒక్కడే కాదా..?

 

అహింస అనే ఆయుధంతో భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మాగాంధీని చంపింది ఎవరు అంటే ముక్త కంఠంతో చెప్పే పేరు గాడ్సే. 1948 జనవరి 30 సాయంత్రం 5.17 నిమిషాలకు ఢిల్లీలోని బిర్లా నివాసంలో ప్రార్థనా సమావేశ మందిరానికి వెళుతున్న గాంధీజీని గాడ్సే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో మూడుసార్లు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపాడు.

 

ఆ వెంటనే గాడ్సే లొంగిపోవడం..న్యాయ విచారణ అనంతరం ఆయన్ను ఉరి తీసినప్పటికీ మహాత్ముని హత్యపై ఇప్పటికీ పలు అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. గాడ్సే గాంధీని మూడు బుల్లెట్లతో కాల్చాడని నాటి పోలీసులు ఎఫ్ఐఆర్‌లో రాశారు. అయితే గాంధీకి నాలుగు బుల్లెట్లు తగిలాయని..అందువల్లే ఆయన మరణించారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ నాలుగో బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది..? దాన్ని ఎవరు పేల్చారు..? అన్న అంశాన్ని అప్పటి పోలీసులు పక్కన పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై డాక్టర్ పంకజ్ ఫడ్నీస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.. మహాత్ముని హత్యకేసును రీ ఓపెన్ చేసి విచారణ జరపాలని కోరారు. ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారించనుంది.