రోజుకో మలుపు... శివసేనకు కాంగ్రెస్ షాక్‌... చివరికి ఏం జరుగుతుందో?

 

మహారాష్ట్ర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. తగినంత సంఖ్యాబలం లేదంటూ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నిరాకరించడంతో... తర్వాత శివసేనకు అవకాశమిచ్చిన గవర్నర్‌.... అంతలోనే షాకిచ్చారు. శివసేనకు ఇచ్చిన డెడ్‌లైన్ ముగియడంతో ఎన్సీపీకి ఆహ్వానం పలికారు. దాంతో, ఎలాగైనాసరే మహారాష్ట్ర పీఠాన్ని దక్కించుకోవాలని తహతహలాడిన శివసేన ఆశలకు తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే, ఎన్సీపీ, కాంగ్రెస్‌‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన తీవ్రంగా ప్రయత్నించింది. అటు ఎన్సీపీ... ఇటు కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపింది. ఎన్సీపీ కండీషన్ మేరకు కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా తప్పుకుంది. అయితే, చివరి నిమిషంలో సోనియా నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో....శివసేన ప్రయత్నాలకు అడ్డుకట్టపడింది.

ఇక, మహారాష్ట్ర పరిణామాలపై సోనియా సుదీర్ఘంగా చర్చించారు. శివసేనకు మద్దతిచ్చే అంశంపై పార్టీ ముఖ్యనేతలతో మంతనాలు జరిపారు. అదే సమయంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే... సోనియాకు ఫోన్ చేసి మద్దతు ఇవ్వాలని స్వయంగా కోరడంతో... పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని తెలిపారు. అనంతరం ప్రకటన విడుదల చేసిన సీడబ్ల్యూసీ... మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతోను, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో చర్చించి... త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. 

గవర్నర్ ఇచ్చిన గడువు ముగియడంతో... ప్రభుత్వ ఏర్పాటుకు మరో 48గంటలు సమయం ఇవ్వాలని శివసేన కోరింది. అయితే, శివసేన వినతిని తిరస్కరించిన గవర్నర్‌.... ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్సీపీకి ఆహ్వానం పలికారు. దాంతో, మహారాష్ట్ర రాజకీయం మరో మలుపు తిరిగినట్లయ్యింది. అయితే, గవర్నర్‌ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో... మహారాష్ట్ర రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రపతి పాలన వచ్చినా, మళ్లీ ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.