ముందే అద్వానం.. మళ్లీ అధికారం కష్టమే...!

 

ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు...బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన కొన్ని సంఘటనలు అన్నీ కలిసి బీజేపీపై వ్యతిరేకత వచ్చేలా చేశాయి. ఇప్పుడు దానికితోడు మధ్యప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఈ వ్యతిరేకతను ఇంకా మూటగట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఏకంగా ఓ 80 ఏళ్ల రైతుకు నోటీసులు జారీ చేసి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రజల్లో ఆగ్రహానికి గురైంది. అసలు సంగతేంటంటే.. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు నిరసనగా జూన్ 1 తేదీన నీముచ్ తాలుకా ఆఫీస్ ముందు భారతీయ కిసాన్ యూనియన్ కార్యకర్తల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఒకటి నిర్వహించనున్నారు. దీనికి భారీ ఎత్తున రైతులు హాజరు కానున్నారని.. ప్రభుత్వ తీరుపై తమకున్న అసంతృప్తిని ప్రదర్శించనున్నారని చెబుతున్నారు. అంతే ఇప్పుడు వారిని ధర్నాని అడ్డుకునే పనిలో పడ్డారు స్థానిక అధికారులు. దీనిలో భాగంగానే..  రైతులకు నోటీసులు ఇస్తూ.. తమ వద్దకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రమంలోనే 80 ఏళ్ల వృద్ధ రైతు గణేశ్రమ్ పాటిదార్ కు నోటీసులు జారీ చేశారు. ఇంత వరకూ బాగానే ఉన్నా ఇక్కడే అధికారులు పప్పులో కాలేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే అధికారులు నోటీసులుజారీ చేసినట్టు తెలుస్తోంది.

 

ఎందుకంటే.. అధికారులు నోటీసులు అందుకున్న పాటిదార్ గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో మంచాన పడి ఉన్నాడట. అలాంటి వ్యక్తికి వెంటనే అధికారుల ముందు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో జనం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దీంతో అసలే ఎంపీలో ప్రభుత్వం పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. దానికి తోడు ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ప్రజలకు ఇంకా మంట పుట్టేలా చేస్తుంది. అంతేకాదు ఈ ఎఫెక్ట్ వచ్చే ఎంపీ ఎన్నికలపై పడుతుందని.. బీజేపీ డౌన్ ఫాల్ కు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు స్పష్టం చేస్తాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి వేలకు వేల కోట్లు కాజేసి వెళ్లిన వాళ్లకి మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వడం చేతకాదు కానీ ఈ ప్రభుత్వాలకి.. చిన్న చిన్న రైతులకు, సామాన్యులపై మాత్రం తమ పైశాచికం చూపిస్తాయి. అందుకే ప్రజలు ఈ ప్రభుత్వాలకు బుద్ది చెప్పే రోజులు ముందు ముందు ఉన్నాయి.