జస్టిస్ రవీందర్ రెడ్డి రాజీనామాలో ట్విస్ట్.. రాజీనామా తిరస్కరణ..

 

మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నవారిని నిర్ధోషులుగా ప్రకటిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తీర్పు ఇచ్చిన సాయంత్రానికే న్యాయమూర్తి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. తీర్పు ఇచ్చిన సాయంత్రానికే ఆయన రాజీనామా చేయడంతో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యారు. ఇప్పుడు ఈయన రాజీనామాలో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఆయన రాజీనామాను ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు తిరస్కరించింది. అంతేకాదు ఆయన తాత్కాలిక సెలవును కూడా రద్దు చేసింది. తన రాజీనామా ఆమోదించేవరకు తనకు సెలవు మంజూరు చేయాలని కోరారు. అయితే దానిని కూడా కోర్టు తిరస్కరించింది. వాస్తవానికి మరో రెండు నెలల్లో జస్టిస్ రవీందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. కానీ అంతకు ముందే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న ఆయన పదవి నుంచి తప్పుకున్నారనే వార్తలు సైతం వచ్చాయి. మక్కా మసీదు కేసులో ఏమైనా ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? అనే సందేహాలు తలెత్తాయి.