మా ఉపాధ్యక్షురాలు మంచు లక్ష్మి

 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీ పడుతుండటంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ పోటీ వలన సినీ పరిశ్రమలో చీలిక ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్న సినీ పెద్దలు కొందరు వారిరువురిలో ఎవరో ఒకరిని పోటీ నుండి విరమిమ్పజేసేందుకు ఇరువురితో సంప్రదింపులు జరుపుతున్నారు. 'మా' ప్రస్తుత అధ్యక్షుడు మురళీ మోహన్ జయసుధకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆయన కూడా ఈ పోటీని నివారించి ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేందుకు కృషి చేస్తున్నారు. సినీ పరిశ్రమలో అందరి కంటే సీనియర్ అయిన దాసరి నారాయణరావు సహకారంతో ఈ పోటీని నివారించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనబడటం లేదు. రాజేంద్ర ప్రసాద్, జయసుధ ఇరువురూ కూడా తమ నామినేషన్లు వేసారు. ఈనెల 29న మా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగబోతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ కి మద్దతు ఇస్తున్నట్లు నాగబాబు ప్రకటించడంతో ‘మెగా హీరోల మద్దతు ఆయనకే ఉంటుందని అనదరూ భావిస్తున్నారు.

 

ఇక ప్రముఖ నటి మరియు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ‘మా’ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఆమెతోబాటు శివకృష్ణ కూడా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, శివాజీ రాజా ప్రధాన కార్యదర్శిగా, ప్రముఖ హాస్యనటుడు ఆలీ ‘మా’ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.