లోయాది సహజ మరణమే.. అనుమానం అవసరం లేదు..


సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్‌ లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరపాలంటూ పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. సొహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసుకు విచారణ న్యాయమూర్తిగా ఉన్న సమయంలో లోయా 2014, డిసెంబర్‌ 1న గుండెపోటుతో మృతిచెందారు. అయితే ఆయనది సహజ మరణం కాదని, లోయా మృతి వెనుక కుట్ర ఉన్నట్లు ఆయన సోదరి ఆరోపించారు. ఇక ఈ కేసుపై విచారించిన సుప్రీంకోర్టు..  బీహెచ్‌ లోయాది సహజ మరణమేనని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఎలాంటి స్వతంత్ర విచారణ అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేసింది. ‘ఈ పిటిషన్లకు ఎలాంటి అర్హత లేదు. లోయాతో పనిచేసిన నలుగురు జడ్డీల వ్యాఖ్యలను అనుమానించడం అవసరంలేదు. పిటిషన్లలో విచారించదగ్గ అంశాలేవీ లేవు. న్యాయవ్యవస్థను నిందించడానికే ఈ పిటిషన్లు వేశారు. లోయా మృతి కేసులో సిట్‌ దర్యాప్తు అనవసరం’ అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్లపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని.. వ్యాపార లేదా రాజకీయ విభేదాలను పరిష్కరించుకునేందుకు కోర్టులు వేదిక కాకూడదని హెచ్చరించింది.