హైదరాబాద్ లో పోలింగ్ శాతం తగ్గడానికి కారణం

 

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే 2014 ఎన్నికలు, 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగా తగ్గింది. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 62.25 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. రాష్ట్రం మొత్తం మీద ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 75.61 శాతం పోలింగ్‌ నమోదైంది. అతితక్కువగా హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 39.49 శాతం నమోదైంది. సాధారణంగానే హైదరాబాద్ లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. 2014 ఎన్నికల్లో 53.27 శాతం ఉండగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 47.29 శాతం నమోదైంది. ఇక తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కనీసం 40 శాతం కూడా నమోదు కాలేదు. అదేవిధంగా.. మల్కాజిగిరిలో 42.75 శాతం, సికింద్రాబాద్ లో 45 శాతం నమోదైంది. దీంతో ఓటర్లు మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పోలింగ్ శాతం తగ్గిపోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు భారీ సంఖ్యలో హైదరాబాద్ లో నివసిస్తూ ఉంటారు. వీరిలో చాలామంది హైదరాబాద్ తో పాటు, సొంత ఊరిలో ఓటు కలిగి ఉన్నారు. ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీ కి కూడా ఎన్నికల జరగడంతో, చాలామంది హైదరాబాద్ నుండి తమ సొంత ఊళ్లకు వెళ్లి అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు.హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తగ్గడానికి ఇది ఒక కారణంగా కనిపిస్తోంది.

ఇక మరో ముఖ్య కారణం.. ఎవరికి ఓటేసి ఏం లాభం అనే అభిప్రాయం ఓటర్లలో ఏర్పడటం. అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ తరువాత ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ కు క్యూ కట్టారు. దీంతో అసెంబ్లీ అంతా దాదాపు గులాబీమయం అయింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ హవా కొనసాగేలా ఉంది. ఒకవేళ వేరే పార్టీ అభ్యర్థికి ఓటేస్తే.. వారు గెలిచినా టీఆర్ఎస్ గూటికి చేరే అవకాశముంది. ఈ మాత్రం దానికి ఓటేయడం ఎందుకనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పలు కారణాల పుణ్యమా అని తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గిపోయింది.