ఆకాశంలో ఓ అద్భుతం

ఖగోళంలో కనువిందు జరిగింది .... ఆకాశంలో  అద్భుతం జరిగింది. దివిలో దివ్యం జరిగింది. సైన్స్ ఒక పక్క, సంప్రదాయం మరొక పక్క వాదులాడుకుంటుంటే ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుంటోంది. క్యాలండర్లు లేవు.... మూహుర్తాలూ లేవు... సీమా సమయ సందర్భాలూ నిర్ణయం కాలేదు. అయినా పంచభూతాలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటున్నాయి. ఇది సైన్స్‌కి, సంప్రదాయానికి మధ్య భువిలో జరుగుతున్న వాదోపవాదమే తప్ప, సృష్టికి మాత్రం ఓ ప్రక్రియ. శుక్రవారం రాత్రి 11.54 నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సరిగ్గా ఒంటి గంటకు సంపూర్ణ సూర్య గ్రహణంగా రూపాంతరం చెందింది. ఈ గ్రహణానికి ఆధునికులు, సనాతనులు ఎవరికి వారు తమ సంకల్పం చెప్పుకుంటున్నారు. ఇవేమీ పట్టని ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుంటోంది. ఇప్పటి వరకు అనేక సంవత్సరాల నుంచి చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు  వస్తూనే ఉన్నాయి. మరో వైపు మానవుడు తన మేథస్సుతో ఖగోళ రహస్యాలను తెలుసుకుంటూనే ఉన్నాడు. అయినా ప్రకృతిపై విజయం మాత్రం మానవాళికి అందడం లేదు.

 

 

భారతదేశ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11.54 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి దేశంలో కోట్లాది మంది ఆకాశం వైపు చూస్తూనే ఉన్నారు. తమ కళ్ల ముందే సంపూర్ణ చంద్రుడు కొద్ది కొద్దిగా కనుమరుగు కావడమనే అద్భుతాన్ని వీక్షించారు.  తెల్లని చంద్రుడు తమ ముందే ఎర్రని చంద్రునిగా మారడాన్ని చూసి దేశ ప్రజలు అచ్చరవొందారు. ఈ అద్భుత అందాన్నిదేశ ప్రజలు తనివితీర చూస్తూ ఆనందించారు. వెలుగును పంచే సూర్యుడికి, వెన్నెలను అందించే చంద్రుడికి మధ్య అప్పుడప్పుడు భూమి ప్రవేశించడమే గ్రహణం అంటే. ఈ చంద్ర గ్రహణ సమయంలో మాత్రం మరో అద్భుతం జరిగింది, అదే అంగారక గ్రహం భూమికి సమీపంలో రావడం. భూమికి దగ్గరైన అంగారకుడు అంతరిక్షంలో చంద్రగ్రహానికి అత్యంత సమీపంగా వచ్చాడు. దీంతో అంగారక గ్రహం అరుణ వర్ణంలో కనిపించింది.సంపూర్ణ చంద్రగ్రహణంపై చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి.

 

 

శాస్త్రవేత్తలు చంద్రగ్రహణ సమయంలో ఏదైనా  తింటూ సెల్‌ఫోన్లతో చంద్రగ్రహణం సెల్ఫీ తీసుకోమంటూ ప్రచారం చేసారు. ఈ ప్రచారం వెనుక చంద్రగ్రహణం సైన్స్ మాత్రమేనని ప్రపంచానికి తెలియజేయడం వారి ఉద్దేశ్యం. మరోవైపు సనాతనులు చంద్ర గ్రహణంతో వివిధ రాశులలో ఉన్న నక్షత్రాలకు చెందిన మానవులపై పడే ప్రభావాన్ని చెబుతున్నారు. కర్కాటక రాశివారికి చిక్కులని, తుల రాశి వారికి మరొకటని ..... ఇలా అన్ని రాశుల వారికి చంద్ర గ్రహణ ఫలిత క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఇంత శాస్త్ర, సాంకేతికత అభివ్రుద్ది జరగక ముందే ఎప్పుడో హేతువాది గోరాగారు ఈ గ్రహాణాలపై ప్రజలను అప్రమత్తం చేసారు.

 

 

అయితే ప్రజల విశ్వాసం మాత్రం సైన్స్‌కు దీటుగా పెరుగుతూనే వచ్చింది. అటు సనాతనులు చేస్తున్న వాదనలోను బలం ఉంది. తారిఖులు, దస్తావేజులు లేకుండానే సనాతనులు తమ ధర్మాన్ని అనుసరించి గ్రహణాలపై చెబుతున్నారు. శాస్త్రవేత్తలు కూడా తమ అనుభవాలను పరిగణలోకి తీసుకుని వారి వాదాన్ని వినిపిస్తున్నారు. వీరివురి సిద్దాంతాలను పక్కన పెడితే గ్రహణం అనేది మానవ జీవితంలో ఒక అద్భుతం.....కళ్ల ముందే గ్రహాలు కనుమరుగు కావడం ఊహకందని రహస్యం. ఈ రహస్యం ఇలా ఉంటేనే అందం......ఆనందం....అద్భుతం.... ఇంతటి అద్భుత గ్రహణం సంభవించేది మళ్లీ 2123 నాటికే. అంటే దాదాపు వందేళ్ల తర్వాతే. అందుకే ఈ అద్భుతాన్ని మధ్య ఆసియా నుంచి తూర్పు ఆఫ్రికా వరకూ అన్ని దేశాల ప్రజలు కనులారా వీక్షించారు.

 

 

శుక్రవారం రాత్రంతా పలు దేశాలలోని ప్రజలు టెలీస్కోపులకు అతుక్కుపోయారు. తమకు అత్యంత సమీపంలోకి వచ్చిన అంగారక గ్రహాన్ని చూసి అశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతం కనుకే గ్రహణాలకు ఇంత ప్రాధాన్యం. భారతీయ సనాతన సంప్రదాయం ప్రకారం గ్రహణ సమయమంటే అరిష్టం. అందుకే తెలుగు రాష్ట్రాలలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, యాదాద్రి దేవాలయం, శ్రీశైలంలోని మల్లికార్జున గుడి, సింహాచలం అప్పన్న ఆలయం, భద్రాచలంలోని రామాలయంతో పాటు చిన్నా చితకా ఆలయాలన్నింటినీ శుక్రవారం మధ్యాహ్నం మూసి వేశారు. గ్రహణం వీడిన తర్వాత శనివారం తెల్లవారుజామున అన్ని దేవాలయాల తలుపులు తెరచి సుప్రభాత సేవలు ప్రారంభించారు. గ్రహణం పట్టడమంటే ఓ అపశకునంగానే భావించే దేశ ప్రజలు గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోరు. గ్రహణం వీడిన తర్వాత మాత్రమే స్నానాదికాలు ముగించి దైవ దర్శనం తర్వాత ఎంగిలి పడతారు. దీనికి ఏ రాష్ట్రమూ మినహాయింపు కాదు.

 

 

వందల ఏళ్ల నుంచి వస్తున్న ఈ సనాతన ధర్మ ఆచారాలను ఏ సైన్స్ ఏమీ చేయలేదని మరోసారి రుజువైంది. నిజానికి ఏ ఆచారమైనా చెడు చేసేదిగా ఉంటే దాన్ని విసర్జించేందుకు మానవులు సంసిద్ధంగా ఉంటారు. గ్రహణం కారణంగా ఎలాంటి చెడు లేనప్పుడు విశ్వాసాలను ఎవరైనా ఎందుకు వదులుకుంటారు... ఎందుకు వదులుకోవాలి.. అలాగే సైన్స్‌కి ఇచ్చే ప్రాధాన్యంలోనూ దేశ ప్రజలు ఏమాత్రం తగ్గరు. దాని విలువను గుర్తెరిగి ప్రవర్తిస్తారు. అందుకే సువిశాల భారతదేశంలో అటు సనాతనం.... ఇటు శాస్త్రం వేలాది సంవత్సరాలుగా కలిసి మెలిసి ఉంటున్నాయి. వైరుధ్యాల కూడలిలో ఎవరి దారి వారిదే అయినా ఒక దానిని మరొకటి గౌరవించుకోవడంలో కూడా దేశం ప్రజలు శభాష్ అనిపించుకుంటున్నారు.