జగన్ బాటలోనే లోకేష్...కానీ ?

 

ఏపీ సీఎం కావడానికి జగన్ తీసుకున్న నిర్ణయాల్లో ఆయన చేపట్టిన పాదయాత్ర ముఖ్యమైనదని చెప్పాలి. ఆయన ప్రజల్లో మమేకం అవ్వడానికి ఈ పాదయాత్ర బాగా ఉపయోగపడింది. ఈ క్రమంలో ఆయన బాటలో మాజీ మంత్రి నారా లోకేష్ ‌కూడా ఈ పాదయాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలు జంప్ కావడానికి సిద్దంగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని నింపి తన అనుభవం కూడా పెంచుకునే ఉద్దేశంతో నారా లోకేష్ ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు పార్టీ వర్గాల నుండి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. 

అయితే అది జగన్ మాదిరి సుదీర్ఘ పాదయాత్ర కాకుండా విడతల వారీగా యాత్ర చేయాలనీ చినబాబు ఆలోచిస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న టిడిపి ఒకపక్క అధికార పార్టీ దాడులతో, మరోపక్క బీజేపీలోకి ఫిరాయింపులతో ఊపిరి సలపలేకుండా పోతోంది. బాబు వల్ల కూడా కావడం లేదని, ఇక టీడీపీని కాపాడాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాలని కొందరు, లేదు బాలయ్య అండర్ లోకి వెళ్ళాలని మరి కొందరు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. 

మరోపక్క అధికార పాఖం లోకేష్ కి పప్పు అనే నిక్ నేమ్ జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఈ నేపధ్యంలో తనపై జరిగిన దుష్ప్రచారానికి చెక్ పెట్టడానికి లోకేష్ సంసిద్ధమవుతున్నారని అంటున్నారు. గత 2004 ఎన్నికల ముందు వైఎస్ పాదయాత్ర 2014 ఎన్నికల ముందు అంటే 2012లో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. మొన్న  2019 ఎన్నికల్లో ప్రజా సంకల్ప యాత్ర చేసి జగన్ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. దీంతో పాదయాత్ర చేసిన వారు అధికారంలోకి వస్తారనే సెంటిమెంట్ ఏర్పడింది. 

అందుకే ఇప్పుడు చిన బాబు పాదయాత్రకు శ్రీకారం చుట్టారని అంటున్నారు.  అయితే వారు చెబుతున్న ఈ విడతల వారీ పాదయాత్ర అనేది సరయిన ఫలితాన్ని ఇవ్వదేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గత వైఎస్ జగన్ పాదయాత్ర అప్పుడు కూడా ఆయన శుక్రవారం అవగానే పాదయాత్రకి బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ కోర్టుకు వెళ్ళేవారు. ఇప్పుడు ఈయనకి అలాంటి ఇబ్బందులు ఏవీ లేకున్నా ఎందుకు ఈ బ్రేక్ ఇస్తున్నారో లోకేష్ కే ఎరుక ! అదీ కాక ముచ్చటగా మూడు నెలల పాలన కూడా చూడకుండా ఇప్పుడే దాడి మొదలు పెడితే అది సత్ఫలితాన్ని ఇస్తుందా లేదనా అనే విషయం మీద కూడా తర్కించాల్సిన అవసరం ఉంది.