నారా వారి ఆస్తులు..తాత కన్నా మనవాడి ఆస్తే ఎక్కువ..

 

ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలను మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. వరుసగా ఎనిమిదోసారి ఆస్తుల వివరాలను ప్రకటించారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తి రూ.88.66 కోట్లుగా ప్రకటించారు. సీఎం చంద్రబాబు ఆస్తి మొత్తం రూ.2.9 కోట్లు అన్నారు. హైదరాబాద్‌లో నివాసం విలువ రూ.8 కోట్లు కాగా, నారావారి పల్లెలో రూ.23.83 లక్షల విలువైన నివాసం ఉందన్నారు. నారా భువనేశ్వరి ఆస్తి రూ.31.01 కోట్లు కాగా, తన ఆస్తి రూ.21.40 కోట్లు, నారా బ్రాహ్మణి ఆస్తి రూ.7.72 కోట్లు, తన కుమారుడు దేవాన్ష్‌ ఆస్తి రూ.18.71 కోట్లు అని వెల్లడించారు. నిర్వాణ హోల్డింగ్స్‌ నికర ఆస్తులు రూ.6.83 కోట్లు అన్నారు. హెరిటేజ్‌ సంస్థ నికర లాభం రూ.60.38 కోట్లుగా ప్రకటించారు. రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకే తాము అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆస్తులను ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. 2011 నుంచి తమ ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నామని లోకేశ్‌ అన్నారు. దేశంలో ఏ రాజకీయ కుటుంబం ఆస్తులను ప్రకటించడంలేదని చెప్పారు.తమ కుటుంబానికి ఆదాయం హెరిటేజ్‌ ద్వారా మాత్రమే వస్తోందని చెప్పారు. కుటుంబం రాజకీయంపై ఆధారపడకుండా సొంతకాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతోనే 1992లో హెరిటేజ్‌ను స్థాపించినట్టు తెలిపారు.