అసలు మ్యాచ్ కు ముందు ఫ్రెండ్లీ మ్యాచ్… అవిశ్వాస తీర్మానం!

ఇప్పుడు తెలుగు మీడియా, హిందీ మీడియా, ఇంగ్లీషు మీడియా అన్న తేడా లేకుండా అంతటా ఒకటే చర్చ! అదే… పార్లెమంట్లో అవిశ్వాస తీర్మానం! చివరకు, ప్రభుత్వ మనుగడకి  కూడా ఈ అవిశ్వాస తీర్మానం మూలంగా మారటంతో స్టాక్ ఎక్స్ ఛేంజ్ కూడా షేక్ అవుతోంది. నష్టాల్లో ముగుస్తోంది. అయితే, నిజంగా ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం ఎఫెక్ట్ ఎంత? దీని తక్షణ ఫలితాలు, రాజకీయ పరిణామాలు ఏంటి?

 

 

కేంద్ర ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మానం గండం అంటే దేశమంతా అలెర్ట్ అవుతుంది. అందుక్కారణం ఒకవేళ ప్రస్తుతం వున్న సర్కార్ కూలితే అన్ని రంగాలు ఒడిదుడుకులకు లోనవుతాయి. కానీ, దాదాపు ఒక దశాబ్దమున్నర తరువాత ఎన్డీఏ ఎదుర్కొంటోన్న బల పరీక్ష గవర్నమెంట్ కూలిపోయేంత ప్రమాదకరమైందేం కాదు. అందుకే, ఒక విధంగా మోదీ, అమిత్ షా నింపాదిగా వున్నారు. స్వయంగా కమలదళానికే మ్యాజిక్ ఫిగర్ దాటేంత శక్తి వుంది. అయినా చిన్నా చితక రాజకీయ ఒడిదుడుకులు ఎదురైనా మద్దతిచ్చేందుకు చాలా పార్టీలే ఎన్డీఏ  లోపలా, బయటా వున్నాయి. కాబట్టి అవిశ్వాస తీర్మానం వల్ల తక్షణం జరిగే గొప్ప మార్పులేం వుండవు. అయితే, అవిశ్వాస తీర్మానం రానున్న సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ఎలా వుండబోతోందో స్పష్టం చేయనుంది. ఎటు వైపు ఎవరు మోహరించి యుద్ధం చేస్తారో దాదాపుగా తేలిపోతుంది!

2014లో మోదీ నేతృత్వంలోని బీజేపికి క్లియర్ మెజార్టీ వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. అయితే, ఈసారి అలాంటి పరిస్థితి వుంటుందా అంటే… అనుమానమే! మోదీపై ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు పని చేయనుంది. అందుకే, మోదీకి భాగస్వామ్య పక్షాల అవసరం వుంది. కానీ, అమిత్ షా దూకుడు, మోదీ విధాన పరమైన నిర్ణయాల వల్ల టీడీపీ లాంటి కీలక పక్షాలు ఎన్డీఏకి దూరమయ్యాయే తప్ప కొత్త పార్టీలేం రాలేదు. ఎన్డీఏలోకి వచ్చిన నితీష్ కుమార్ కూడా 2019 ఎన్నికల్లో ఎటువైపు వుంటారో క్లారిటీ ఇవ్వటం లేదు! ఎన్డీఏలో ఇప్పటికీ వున్న శివసేన, అకాళీదళ్ లాంటి పార్టీలు కూడా బీజేపీ పెద్దన్న మనస్తత్వం జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ పరిణామాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానంపై ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా , అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఇప్పుడు వస్తుండటంతో ఎవరు మోదీ వైపో, ఎవరు కాదో తేలిపోనుంది!

 

 

జాతీయ స్థాయిలో అందరి దృష్టి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వుంది. కానీ, ఏపీలో మాత్రం టీడీపీ కోణం నుంచే రాజకీయం నడుస్తోంది. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు అవిశ్వాస తీర్మాన రాజకీయం చేశారు. అది ఫలించి మోదీ చర్చకు సై అన్నారు. కాకపోతే, ఈ అవిశ్వాస తీర్మానం ఎవరి నిజ స్వరూపం ఏంటో తేల్చేసింది. టీఆర్ఎస్ నిన్న మొన్నటి వరకూ టీడీపీ ప్రత్యేక హోదా డిమాండ్ కు అనుకూలంగానే మాట్లాడినా అవిశ్వాసానికి మాత్రం మద్దతిచ్చేది లేదని తేల్చేసింది. ప్రత్యక్షంగానే మోదీకి సపోర్ట్ చేస్తోంది. ఇదే దారిలో అన్నాడీఎంకే కూడా వుంది. జయలలిత మరణం తరువాత పూర్తిగా మోదీ అదుపాజ్ఞల్లో వుంటోన్న ఆ పార్టీ అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయమని తేల్చింది. ఇలాగే ఇంకా కొన్ని పార్టీలు వున్నాయి. ఒడిషాలోని బీజూ జనతాదళ్ ఎటూ తేల్చటం లేదు. అయితే, ఓటింగ్ టైంలో ఆ పార్టీ వారు గైర్హాజరై మోదీకి పరోక్షంగా సాయపడతారనే టాక్ నడుస్తోంది.

దేశవ్యాప్తంగా వున్న మోదీ వ్యతిరేక, అనుకూల పార్టీలు ఏవో తేలటమే కాదు… అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీజేపీలోని అసతంతృప్తుల సత్తా ఏంటో కూడా తేలిపోనుంది! శతృఘ్న సిన్హా లాంటి వారు నిత్యం మోదీ వ్యతిరేక కామెంట్లు చేస్తూ వచ్చారు ఇంతకాలం. ఇలాంటి వారొక ఆరుగురు వుంటారని అంచనా. ఈ రెబెల్స్ ను తమవైపుకు లాగాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అది ఫలిస్తుందా లేదా అన్నది కూడా ఓటింగ్ టైంలో తేలిపోతుంది. కానీ, శతృఘ్న సిన్హా తన ఓటు ఎన్డీఏ సర్కార్ కి అనుకూలంగానే వుంటుందని ఇప్పటికే చెప్పేశారు!

 

 

అవిశ్వాస తీర్మానికి అటు కాంగ్రెస్ చెబుతోన్న కారణాలు, ఇటు టీడీపీ చెప్పిన ప్రత్యేక హోదా ఏవీ కూడా బల పరీక్ష కారణంగా నెరవేరే అవకాశాలు లేవు. అలాగని మోదీ ప్రభుత్వం కూలే ఛాన్స్ కూడా లేదు. ఈ పార్లమెంట్ యుద్ధం కేవలం రానున్న బ్యాలెట్ యుద్దానికి మూడ్ సెట్ చేసేలా మాత్రమే వుంది! ఒక విధంగా ఇది అసలు టోర్నమెంట్ కు ముందు ఫ్రెండ్లీ మ్యాచ్ అనుకోవచ్చు! అయినా కూడా చాలా పార్టీలు, నాయకులు ఆశిస్తున్నట్టు 2019లొ మోదీని అడ్డుకోవటం ఎంత వరకూ సాధ్యం? ఇది మాత్రం అస్సప్టంగా అయినా ఈ బలపరీక్షతో తెలిసిపోనుంది!