తెలంగాణలో లాక్ డౌన్?

కరోనా కట్టడి చర్యల్లో తెలంగాణ సర్కార్ పై తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు..  రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, ర్యాలీలు, వివాహాలపై ఆంక్షలు విధించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని ఆదేశించింది. ప్రయివేటు, ప్రభుత్వ ఆస్పత్రుల బెడ్స్‌పై పర్యవేక్షణ ఏర్పాటు చేసి రోగులను కాపాడాలని ఆదేశాల్లో పేర్కొంది. 

48 గంటల్లో కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్ గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే తామే ఆదేశాలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. వాస్తవాలను కప్పి పుచ్చుకుండా, కరోనా మరణాలు, టెస్టులు, బెడ్స్‌పై వాస్తవ సమాచారాన్ని రోజు వారీ మీడియా బులెటిన్‌లో పేర్కొనాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22 తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. 

రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరోనాను నియంత్రించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కే కన్నెర్రజేసింది. సినిమా హాల్‎లు, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో కనీస వివరాలు లేకపోవడంతో న్యాయస్థానం అక్షింతలు వేసింది. ‘పబ్బులు, మద్యం దుకాణాలపై చర్యలు ఏమయ్యాయి..? మీకు ఆదాయమే ముఖ్యమా..?’ అని ప్రభుత్వాన్ని కోర్టు సూటిగా ప్రశ్నించింది. జిల్లా అధికారులు ఇచ్చే కరోనా కేసుల రిపోర్టులకు, ప్రభుత్వం ఇచ్చే పూర్తి రిపోర్టులకు చాలా వ్యత్యాసం ఉందంటూ కేసీఆర్ సర్కార్‌పై కోర్టు ఆగ్రహించింది.

హైకోర్టు అడిగిన ప్రశ్నలకు ఏజీ సమాధానం ఇలా.. త్వరలో జన సంచారం నియంత్రణకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏజీ చెప్పిన జవాబుకి హైకోర్టు సీరియస్ అయింది. ‘ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా టెస్టులు ఎందుకు చేయట్లేదు..? ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు..? అసలు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా? లేదా ఆదేశాలు ఇవ్వమంటరా..?’ అంటూ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.