తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిరగదేం నాయకా?

బయట రాష్ట్రాల్లో చక్రాలు తిప్పుతున్న తెలుగు బీజేపీ నేతలు

 

ఎవరయినా ఇంట గెలిచి రచ్చ ఓడతారు. కానీ మన తెలుగు రాష్ట్రాల కమలనాధులు మాత్రం.. ఇంట ఓడి, రచ్చ గెలుస్తున్నారు. అవును. తెలుగు రాష్ర్టాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద బాధ్యతల్లో పనిచేసిన-చేస్తున్న బీజేపీ అగ్రనేతల చక్రం.. సొంత తెలుగు రాష్ర్టాల్లో మాత్రం తిరగకపోవడమే ఆ పార్టీ కార్యకర్తలను ఆశ్చర్యపరుస్తోంది. బయట రాష్ర్టాల్లో తమ నేతలు చక్రం తిప్పినందువల్లే, అక్కడ కమలం వికసించిందంటూ సదరు నేతల వీరాభిమానులు, సోషల్‌మీడియాలో పోస్టింగులు పెడుతుంటారు. మరికొందరు నేతల పేరుతో ఏకంగా అభిమానసంఘాలే ఉన్నాయి. కానీ, ఏపీ-తెలంగాణ రాష్ర్టాల్లో పార్టీని కనీసం ప్రతిపక్ష స్థానానికి కూడా ఇప్పటిదాకా ఎందుకు తీసుకురాలేకపోతున్నారో అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు.

 

ఉమ్మడి-విభజిత రాష్ర్టాలు ఏర్పడి ఇన్నాళ్లయినా... బీజేపీ, రెండు రాష్ర్టాల్లో ఇప్పటిదాకా కనీసం ప్రతిపక్ష స్థానానికీ ఎదగలేకపోయింది. ఆలోగా, ఒకే ఒక్క స్థానాలున్న రాష్ర్టాల్లో సైతం అధికారంలోకి వచ్చింది. మరికొన్ని రాష్ర్టాల్లో ప్రతిపక్ష స్థాయికి చేరింది. లోక్‌సభలో రెండు సీట్లకు పరిమితమైన బీజేపీ, ఇప్పుడు దేశంలో రెండోసారి మళ్లీ అధికారంలో కొనసాగుతోంది. దేశంలో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీగా అవతరించింది. చివరకు కల అనుకున్న కశ్మీర్‌లో కూడా, అధికారంలో భాగస్వామిగా మారింది. మరికొన్ని రాష్ర్టాల్లో సంకీర్ణ భాగస్వామిగా కొనసాగుతోంది.

 

దేశంలో ఇన్ని అద్భుతాలు సృష్టించిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం, కనీసం ప్రతిపక్ష స్థాయికి సైతం చేరుకోలేకపోవడానికి, కారణమేమిటన్న చర్చకు పార్టీ వర్గాల్లో తెరలేచింది. వెంకయ్యనాయుడు ఎమ్మెల్యే నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగినా, పార్టీ మాత్రం ఆ స్థాయి-ఆయన స్థాయికి చేరకపోవడమే ఆశ్చర్యం. అయితే తెలుగు రాష్ర్టాలకు చెందిన రాంమాధవ్, పేరాల చంద్రశేఖర్, మురళీధర్‌రావు, సత్య వంటి నేతలు.. ఇతర రాష్ట్రాలకు ఇన్చార్జిలుగా ఉన్నప్పుడు, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. దానిపై రాంమాధవ్, మురళీధర్‌రావు, సత్య అభిమానులు సోషల్‌మీడియాలో చాలా హడావిడి చేశారు. ఆయా నేతలు ఆ రాష్ర్టాల్లో చక్రం తిప్పినందుకే, పార్టీ విజయం సాధించిందంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చేలా చూశారు.

 

రాంమాధవ్ కశ్మీర్, ఈశాన్య రాష్ర్టాలు, మురళీధర్‌రావు కర్నాటక, పేరాల చంద్రశేఖర్ అస్సోం, తాజాగా సత్య బిహార్ ఎన్నికల్లో చక్రం తిప్పారంటూ, వారి అభిమానులు సోషల్‌మీడియాలో హంగామా చేసిన విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. రెండురోజుల క్రితమే.. బిహార్‌లో పార్టీ బహిరంగ సభల నిర్వహణ బాధ్యత చూసిన, జాతీయ కార్యదర్శి సత్యను అభినందిస్తూ, ఆయన అభిమానులు పోస్టు పెట్టారు. మరి పరాయి రాష్ట్రాల్లో ఇన్ని అద్భుతాలు సృష్టించి.. పార్టీని విజయతీరాలకు చేర్చిన ఈ నాయకులు, సొంత తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి, ఎందుకు వెలుగు తెప్పించలేకపోతున్నారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

 

ఏపీలో టీడీపీతో కలసి పోటీ చేస్తే అరజడజను ఎమ్మెల్యే సీట్లు కూడా సాధించలేకపోయింది. ఒక్క ఎంపీతోనే సర్దుకోవలసి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. పైగా నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుంది. చివరాఖరకు ఆ పార్టీ సాధించిన ఓట్ల శాతం పాయింట్ ఎనిమిది!

 

కశ్మీర్‌తోపాటు, ఈశాన్య రాష్ట్రాల్లో చక్రం తిప్పిన రాంమాధవ్ సొంత రాష్ట్రంలో, పార్టీకి ఈ దుస్థితి పట్టడాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. మరి ఆయన చక్రం ఏపీలో ఎందుకు తిరగలేదన్నది వారి ప్రశ్న. రాంమాధవ్ సొంత తూర్పు గోదావరిలో గానీ, జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్య సొంత కడప జిల్లాలో గానీ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

 

ఇక జాతీయ ప్రధాన కార్యదర్శి వరకూ ఎదిగి.. కర్నాటకలో అద్భుతాలు సృష్టించి, తమిళనాడులో పార్టీపరంగా కొన్ని వివాదాల్లో ఇరుకున్న మురళీధర్‌రావు.. తన సొంత తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి, కనీసం రెండోసీటు కూడా ఎందుకు సాధించలేకపోయారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మురళీధర్‌రావు తన సొంత కరీంనగర్ జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటు సాధించలేకపోయారని, చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపించలేకపోయారని నేతలు గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో 5 సీట్లు సాధించిన పార్టీ, తర్వాత ఎన్నికల్లో ఒక్క అదనపు స్థానం సాధించలేకపోగా, ఒక్కటి మాత్రమే వచ్చిందంటే.. మరి ఆయన చక్రం తెలంగాణలో ఎందుకు తిరగలేదని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.

 

దుబ్బాకలో గెలిచిన రఘునందన్‌రావు స్వయంకృషితోనే, పార్టీకి ఒక సీటు అదనంగా వచ్చింది తప్ప, ఎవరి చక్రాలు అక్కడ తిరగలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దుబ్బాకలో బీజేపీ విజయం వెనుక అభ్యర్థితోపాటు, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ శ్రమ, వివేక్ వెంకటస్వామి వంటి నేతల సహకారం మాత్రమే ఉందంటున్నారు. తొలి ఎమ్మెల్యే రాజాసింగ్, తాజాగా రఘునందన్ విజయం వారి వ్యక్తిగతమేనని స్పష్టం చేస్తున్నారు.

 

దుబ్బాకలో పోటీ తీవ్రంగా ఉండి, అధికార టీఆర్‌ఎస్ కోట్ల రూపాయలు వెదజల్లుతోందన్న ఆందోళన, ప్రచార సమయంలో బీజేపీ నేతల్లో వ్యక్తమయింది. కానీ అభ్యర్ధి రఘునందన్‌రావుకు, జాతీయ పార్టీ నుంచి సకాలంలో ఆర్ధిక సహకారం అందించేలా చూడటంలో.. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వారంతా విఫలమయ్యారని నేతలు స్పష్టం చేస్తున్నారు. అక్కడి నుంచి ‘రెండు అంకెలకు’ మించి ఆర్ధిక సాయం రాలేదంటే, పదవుల్లో ఉన్న వారిపై జాతీయ నాయకత్వానికి.. ఎంత నమ్మకం- వారికి జాతీయ నాయకత్వ వద్ద పలుకుబడి, ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 

అస్సోంలో చక్రం తిప్పిన మరో నేత పేరాల చంద్రశేఖర్, స్వయంగా ఎల్‌బినగర్‌లో పోటీ చేసి ఓడిపోవడమే ఆశ్చర్యమంటున్నారు. ఒక రాష్ట్రంలోనే చక్రం తిప్పిన ఓ అగ్రనేత.. చివరాఖరకు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి తానే ఓడిపోయారంటే, దాని సంకేతం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంటే వీరికి స్థానబలం లేకపోవడం ఒక కారణమయి ఉండాలి. లేదా స్థానికంగా ప్రజల నాడి తెలుసుకోవడంలోనయినా, విఫలమయి ఉండాలని విశ్లేషిస్తున్నారు.

 

ఇక ఎన్నికల్లో వైఫల్యాలను.. కేవలం రాష్ట్ర అధ్యక్షులనే బాధ్యులను చేస్తున్న నాయకత్వం, పార్టీకి దిశానిర్దేశం చేసే.. సంఘటనా కార్యదర్శులను మాత్రం కొనసాగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో వైఫల్యానికి అధ్యక్షుడు డాక్టర్ కోవా లక్ష్మణ్, ఏపీలో వైఫల్యానికి కన్నా లక్ష్మీనారాయణను బాధ్యులను చేసి, వారిని తొలగించారు. అందులో లక్ష్మణ్‌ను, ఓబీసీ జాతీయ సెల్ అధ్యక్షుడిగా నియమించగా, కన్నాకు అది కూడా ఇవ్వలేదు. అది వేరే విషయం.

 

కానీ తెలంగాణ సంఘటనా కార్యదర్శిగా ఏళ్ల తరబడి కొనసాగుతున్న మంత్రి శ్రీనివాస్-రాష్ట్ర ఇన్చార్జి కృష్ణదాస్, రెండున్నరేళ్ల నుంచి ఏపీ సంఘటనా కార్యదర్శిగా కొనసాగుతున్న మధుకర్-రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దియోథర్‌ను మాత్రం, అలాగే కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సంఘటనా కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, ఆరేళ్ల నుంచి బాధ్యునిగా వ్యవహరిస్తున్నా, పార్టీ కించిత్తు పురోగతి సాధించలేదంటున్నారు.

 

అటు జాతీయ స్థాయిలో కూడా వైఫల్యాలకు, సంఘటనా కార్యదర్శులు నైతిక బాధ్యత వహించకపోవడం ఏమిటన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీ-తెలంగాణకు మూడు దశాబ్దాల నుంచి ఇన్చార్జిగా ఉన్న, జాతీయ సంఘటనా జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్‌జీ.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి సంబంధించి, సాధించిన పురోగతి ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక రెండేళ్ల నుంచి ఇన్చార్జిగా ఉన్న సంతోష్‌జీ కూడా, అదే హోదాలో కొనసాగుతున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు.

 

మరి ఇటీవలి ఎన్నికల పరాజయంలో వారి పాత్ర లేదా? వారి అనుమతితోనే టికెట్లు, నిర్ణయాలు జరిగినప్పుడు, మరి వారెందుకు బాధ్యత వహించరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించడంలో సీరియస్‌గా దృష్టి సారించి, ఎక్కువ సమయం కార్యకర్తల మధ్య గడిపి ఉంటే .. తెలుగు రాష్ర్టాల్లో పార్టీ పరిస్థితి, ఇంత విషాదంగా ఉండేది కాదన్న వ్యాఖ్యలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. గత ఏడాదిన్నర క్రితం హైదరాబాద్‌లో.. అనుబంధసంస్ధలతో సమావేశం నిర్వహించారు. కానీ వారి నుంచి ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోకుండా, నేతలు చెప్పింది వినకుండానే కేవలం అరగంటలో ఆ సమావేశాన్ని ముగించిన వైనాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు. అంటే దీన్నిబట్టి... రాష్ట్రానికి బాధ్యులుగా వచ్చేవారికి, స్థానిక అంశాలపై ఎంత శ్రద్ధ ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు.

-మార్తి సుబ్రహ్మణ్యం