సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి!!

 

తెలంగాణలో టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ఎల్పీ విలీనం ప్రక్రియ పూర్తయ్యింది. అసెంబ్లీ కార్యదర్శి ఇందుకు సంబంధించిన బులిటిన్ కూడా విడుదల చేయడంతో.. తెలంగాణలో కాంగ్రెస పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయినట్టయ్యింది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో ఎంతమందికి మంత్రి పదవులు దక్కుతాయనే అంశంపై అప్పుడే చర్చ మొదలైంది. ముఖ్యంగా మజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మాత్రం ఈ సారి జరగబోయే మంత్రివర్గ విస్తరణలో చోటు ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. 

తన కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇద్దరు మహిళలను కేబినెట్‌లోకి తీసుకుంటానని అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు ఎవరనే దానిపై అప్పట్లో చర్చ జరిగింది. తాజాగా సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంతో ఆమెకు మంత్రి పదవి దాదాపు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. చేవెళ్ల ఎంపీ సీటు టీఆర్ఎస్‌ ఖాతాలో పడటం కూడా సబితాకి కలిసొచ్చే అంశమని తెలుస్తోంది. చేవెళ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు కోసం సబితా గట్టిగా కృషి చేశారు. ఆమెకు పట్టున్న పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ మెజార్టీ సాధించింది. దీనికితోడు టీఆర్ఎస్‌లో చేరే సమయంలోనే కేసీఆర్ ఆమెకు మంత్రి పదవిపై హామీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. మొత్తానికి టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం పూర్తి కావడంతో.. ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే నెలకొంది. చూద్దాం మరి ఎవరెవరికి మంత్రి పదవులు వరిస్తాయో.