వాడకపోతే వృధా!

చాలారోజుల క్రితం ఒక గొప్ప వ్యాపారి ఉండేవాడు. వ్యాపార నిమిత్తం అతను ఓసారి దూరదేశాలకు బయల్దేరాడు. వెళ్తూ వెళ్తూ అతను, తన దగ్గర పని చేసే ముగ్గురు పనివాళ్లని పిలిచాడు. ‘చూడండి! నేను తిరిగి రావడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా నేను మీకో పని అప్పచెబుతున్నాను. మీ ముగ్గురికీ నేను కొంత డబ్బుని ఇస్తున్నాను,’ అంటూ మొదటి వ్యక్తికి ఐదువేలు, రెండో వ్యక్తికి రెండువేలు, మూడో వ్యక్తికి వేయి రూపాయల డబ్బుని చేతికిచ్చాడు.

 

అలా యజమాని తన ముగ్గురు పనివాళ్లకీ డబ్బుని అందించి ప్రయాణమైపోయాడు. కొంతకాలం తర్వాత యజమాని తిరిగివచ్చాడు. ‘నేను మీకిచ్చిన డబ్బుని ఏం చేశారు?’ అని ఆ ముగ్గురినీ అడిగాడు.

 

‘ప్రభూ! వ్యాపారం చేయడం మీ లక్షణం. డబ్బుని స్థిరంగా ఉంచడం మీకు ఇష్టం ఉండదు. మీ మనస్తత్వం తెలిసినవాడిని కనుక మీరిచ్చిన డబ్బుని పెట్టుబడి పెట్టాను. రాత్రింబగళ్లు కష్టపడ్డాను. ప్రస్తుతానికి మీరు ఇచ్చిన డబ్బు రెట్టింపైంది,’ అని పదివేల రూపాయలని చేతిలో పెట్టాడు మొదటి పనివాడు.

 

‘ప్రభూ! వ్యాపారం చేయడం నాకు అలవాటైన విద్య కాదు. కానీ డబ్బుని అలా నిరుపయోగంగా ఉండటం నాకు ఇష్టం లేకపోయింది. అందుకనే నష్టం వచ్చే ప్రమాదం ఉందన్న భయం ఉన్నా కూడా ఆ డబ్బుతో వ్యాపారం చేశాను. ఒళ్లు వంచి పనిచేశాను. అదృష్టవశాత్తూ ఫలితం దక్కింది. రెండు వేలు కాస్తా నాలుగు వేలు అయ్యాయి,’ అని చెప్పుకొచ్చాడు రెండో పనివాడు.

 

‘ప్రభూ! మీరు పాపం డబ్బుని ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. డబ్బు కోసం ఇల్లు విడిచి ఎక్కడెక్కడో వ్యాపారం చేసి వస్తుంటారు. అలాంటి డబ్బుని ఏదో ఒకటి చేసి పాడు చేయడం నాకు ఇష్టం లేకపోయింది. అందుకే ఓ గొయ్యి తీసి ఎవరికీ కనిపించకుండా ఆ డబ్బుని దాచిపెట్టాను. ఇదిగోండి మీరు ఇచ్చిన సొమ్ముని యథావిధిగా మీ చేతిలో పెడుతున్నాను,’ అంటూ వెయ్యి రూపాయలు ఉన్న మూటని వ్యాపారి చేతిలో పెట్టాడు మూడో పనివాడు.

 

‘మూర్ఖుడా! డబ్బయినా, ప్రతిభ అయినా ఒక వరంలాంటిది. దాన్ని ఉపయోగించకపోతే ఎవరికీ పనికిరాకుండా పోతుంది. నీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయావు. ఆ డబ్బు నీకూ ఉపయోగపడలేదు, నాకూ ఉపయోగపడలేదు. మొదటి ఇద్దరూ నేను ఇచ్చిన డబ్బులతో పాటు, వచ్చిన లాభాలని అట్టిపెట్టుకోండి. కానీ మూడో వ్యక్తికి ఇచ్చిన వేయి రూపాయలని కూడా నేను తిరిగి తీసేసుకుంటున్నాను,’ అన్నాడు వ్యాపారి.

 

ఇది బైబిల్‌లో Parable of the Talents అనే కథ ఆధారంగా రాయబడింది. ఇందులో వ్యాపారి తన ముగ్గురు పనివాళ్లకీ ఇచ్చిన సొమ్ముని ‘Talent’ అని పిలుస్తాడు. Talent అనేది పూర్వకాలంలో డబ్బుకి ఓ కొలబడ్డగా వాడేవారు (మిలియన్, లక్ష, వేయి లాగా). వ్యాపారి మొదటి పనివాడికి ఎనిమిది టాలెంట్లు, రెండోవాడికి రెండు టాలెంట్లు, మూడోవాడికి ఒక్క టాలెంటు ఇచ్చి వెళ్తాడన్నమాట. కానీ ఇక్కడ టాలెంట్ అంటే ప్రతిభ అన్న అర్థం కూడా వస్తుంది! ప్రకృతి మనలో ప్రతి ఒక్కరికీ కొన్ని టాలెంట్స్ ఇస్తుంది. వాటిని సవ్యంగా వాడుకున్నవాడు జీవితంలో పైకి వస్తాడు. ఉన్న ఒక్క టాలెంటునీ వాడుకోకుండా దాచుకున్నవాడు ఎందుకూ కొరగాకుండా పోతాడు. ఎక్కడ ఏ నష్టం వస్తుందో అని భయపడుతూ తన ప్రతిభని అణచివేసిననాడు జీవితం వృధా అయిపోతుంది.

- నిర్జర.