నిజమైన తృప్తి ఎక్కడ దొరుకుతుంది

అనగనగా ఓ రాకుమారి. ఆ రాకుమారి మనసులో ఏదో దిగులు. తన జీవితంలో ఏదో పొందలేకపోయానన్న బాధ. ఆ బాధతోనే నిరంతరం దేవుని ప్రార్థిస్తూ ఉండేది. తనకో దారి చూపమని ఆ భగవంతుని వేడుకునేది. ఒకసారి అలా తీవ్రమైన ప్రార్థనలో మునిగి ఉండగా ఆమెకు ఒక ఆకాశవాణి వినిపించింది. ‘నీ మనసులో ఉన్న వెతని తీర్చేందుకు నేను ముగ్గురు దేవదూతలను పంపుతాను. ఆ ముగ్గురులో ఎవరు నీకు శాంతిని కలిగించగలరో నువ్వే తేల్చుకో!’ అంటూ ఆ ఆకాశవాణి చెప్పింది.

 

ఆ మాటలు వినిపించినప్పటి నుంచీ ఆ రాకుమారి తన కోసం వచ్చే దేవదూతల కోసం ఎదురుచూడసాగింది. ఆకాశవాణి చెప్పినట్లుగా మర్నాడు రాత్రి ఆ రాకుమారి గది దగ్గరకి ఓ దేవదూత వచ్చి నిల్చొంది. ‘రా నేస్తం నాతో కలిసి కాసేపు ప్రయాణించు. నీ మనసుకి తృప్తి కలుగుతుందేమో చూద్దాము,’ అని చెప్పింది.

 

రాకుమారి ఆ దేవదూత మాటని నమ్మి తనతో ప్రయాణం సాగించింది. వారి ప్రయాణం నిజంగా ఓ అద్భుతం. ఆకాశ వీధులగుండా, బంగారు తాపడం చేసిన భవనాల పక్క నుంచీ, మిరుమిట్లు గొలిపే వజ్రాల కాంతిలో వారి ప్రయాణం సాగింది. ఆ వైభవాన్ని చూసేందుకు రాకుమారికి రెండు కళ్లూ సరిపోలేదు. కానీ ఆమె మనసులోని అసంతృప్తి మాత్రం అలాగే మిగిలిపోయింది. ‘ఎవరు నువ్వు! నీతో ఉంటే నా కళ్లకి తృప్తిగా ఉంది కానీ నా మనసు మాత్రం సంతోషంగా లేదు’ అని అడిగింది రాకుమారి. ఆ మాటలకు దేవదూత చిరునవ్వుతో... ‘నేను సంపదను, నేను ఎంతసేపు నీతో ఉన్నా నీకు తృప్తి కలగదు,’ అంటూ మాయమైపోయింది.

 

రెండో రోజు రాత్రి రాకుమారి చెంతకు మరో దేవదూత వచ్చింది. తనతో కలిసి ప్రయాణించమని రాకుమారిని ఆహ్వానించింది. అతనితో రాకుమారి బయల్దేరింది కూడా. సుదూర రాజ్యాల వైపుగా వారి ప్రయాణం సాగింది. దారి పొడుగునా వారిని చూసి ప్రజలు జేజేలు పలకసాగారు. ఆకాశం ఎత్తుల నుంచి పూలు వర్షం కురిసింది. కానీ రాకుమారి మనసులోని అసంతృప్తి మాత్రం అలాగే మిగిలిపోయింది. ‘ఎవరు నువ్వు! నీతో ఉంటే నాకు భలే గర్వంగా ఉంది. ఆ గర్వంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది. కానీ మనసు మాత్రం ఇంకా చింతలోనే మునిగి ఉంది,’ అని అడిగింది రాకుమారి. ఆ మాటలకు బదులుగా దేవదూత దర్పంగా... ‘నేను కీర్తిని, నేను నీతో ఉంటే ఈ లోకం నీకు జేజేలు పలుకుతుంది. కానీ నీ మనసుకి తృప్తి కలుగుతుందో లేదో చెప్పలేను,’ అంటూ వెళ్లిపోయింది.

 

ఇక మూడో రోజు రాత్రి రాకుమారి విచారవదనంతో తన భవనంలో కూర్చుంది. బహుశా ఇవాళ వచ్చే దేవదూత కూడా తన అశాంతిని తొలగించలేదేమో అన్న నిరాశలో మునిగిపోయింది. అలా ఉండగా ఓ దేవదూత ఆమె దగ్గరకి వచ్చింది. ఆమె నడక చాలా నిదానంగా ఉంది. మొహంలో ముదుసలి ఛాయలు కనిపిస్తున్నాయి. కానీ ఆ ముడతల వెనుక ఏదో తెలియని ప్రశాంతత కనిపిస్తోంది. ఆమెని చూడగానే ఆమె వెనకాలే నడిచింది రాకుమారి. వాళ్లు గాలిలో తేలలేదు. బంగారపు భవనాల మీదుగా ఎగరలేదు. వారిని చూసిన జనం అసలు పట్టించుకోనేలేదు. పైగా తను నడుస్తున్న బాట ఏమంత సౌఖ్యంగా లేదని అనిపించింది రాకుమారికి. మధ్యమధ్యలో ఆమె శరీరాన్ని ముళ్లు గీరుకున్నాయి కూడా! అలా చాలా దూరం నడిచీ నడిచీ రాకుమారికి చెప్పలేని అలసట కలిగింది. కానీ ఆమె మనసు మాత్రం ఎందుకనో చాలా సంతోషంగా ఉంది. ‘ఏంటి ఈ వైరుధ్యం. నేను నీతో వచ్చి బావుకున్నది ఏమీ లేదు. అయినా నా మనసు ఎందుకనిలా సంతోషంలో తేలిపోతోంది. ఇంతకు ముందెన్నడూ ఎరుగని తృప్తి కలుగుతోంది,’ అని అడిగింది రాకుమారి. ‘నేను నిజానికి ప్రతినిధిని. నాతో ఉంటే నీ జీవితం సుఖంగా ఉంటుందని చెప్పలేను, ప్రజలు నిన్ను ఆదరిస్తారని అనుకోను. కానీ నీ మనసు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. నీ బతుకు మీద నీకే గౌరవం ఏర్పడుతుంది,’ అని బయల్దేరింది దేవదూత.

 

రాకుమారి అశాంతికి ఎట్టకేళకు ఆ దేవదూత దగ్గర సమాధానం లభించింది. ఇక మీదట ‘సత్యం’ అనే మార్గానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకుంది.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

 

- నిర్జర.