అన్నిటికంటే ప్రమాదకరం

అనగనగా ఓ దెయ్యం! ఆ దెయ్యం పనిచేసీ పనిచేసీ అలసిపోయింది. ఇక మనుషులని పాడు చేయడం అనే వృత్తి నుంచి విరమించుకుని ప్రశాంత జీవితాన్ని గడుపుదామనుకుంది. అందుకోసం తన దగ్గర ఎప్పటి నుంచో పోగేసుకున్న ఆయుధాలన్నింటినీ అమ్మకానికి పెట్టింది.

 

వృద్ధ దెయ్యం అమ్మకానికి పెట్టిన ఆయుధాలను కొనుక్కొనేందుకు పిల్లదెయ్యాలన్నీ ఎగబడ్డాయి. ఆ ఆయుధాలలో చాలా రకాలు ఉన్నాయి. మనిషి మీద మనిషిలో అసూయని పుట్టించే ఆయుధం, కోపం కట్టలు తెంచుకునేలా చేసే ఆయుధం, ద్వేషం ఎగిసేలా చేసే ఆయుధం... ఇలా రకరకాల ఆయుధాలు ఉన్నాయి. కామం, క్రోధం, మోహం, లోభం... ఇలా అరషడ్వర్గాలనీ ఎగదోసే ఆయుధాలు వాటిలో ఉన్నాయి. కానీ ఒక మూలన ఉన్న ఆయుధమేమిటో పిల్లదెయ్యాలకి అర్థం కాలేదు. అది తరచూ వాడినదానిలా బాగా అరిగిపోయి ఉంది. కానీ దాని ధర చూస్తేనేమో మిగతా ఆయుధాలకంటే రెట్టింపు ఉంది. ‘‘అదేం ఆయుధం పెద్దాయనా! చూస్తేనేమో బాగా అరిగిపోయి ఉంది. ఖరీదేమో అంతేసి చెబుతున్నావు. అంత ఖర్చుపెట్టి సొంతం చేసుకునేందుకు దానిలో ప్రత్యేకత ఏంటి?’’ అని అడిగిందో ఔత్సాహిక దెయ్యం.

 

‘‘ఆ ఆయుధం పేరు ‘నిరుత్సాహం’ నాయనా! మనిషిని నాశనం చేయడానికి మిగతా ఆయుధాలు ఉపయోగపడకపోవచ్చు. కానీ నిరుత్సాహం మాత్రం బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. దానిని ఉపయోగించి నేను నిదానంగా మనిషి మనసుని తెరుస్తాను. ఆపై క్రమంగా అతని మెదడుని ఆక్రమించుకుంటాను. ఆ నిరుత్సాహంతో మనిషి క్రుంగిపోతాడు. ఎంతటి శక్తిమంతుడైనా ఎందుకూ పనికిరాకుండా పోతాడు. విశేషం ఏమిటంటే... ఇంత జరుగుతున్నా కూడా నిరుత్సాహం అనే అస్త్రం ద్వారా నేను అతనిలో తిష్ట వేసుకున్నట్లు మనిషి గ్రహించనేలేడు. అలా తెలియకుండానే తన జీవితాన్ని వృధా చేసేసుకుంటాడు.’’ అంటూ చెప్పుకొచ్చింది వృద్ధ దెయ్యం.

వృద్ధ దెయ్యం మాటలు పూర్తికాగానే ఒక్కసారిగా కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఎంత ఖరీదైనా సరే ఆ ఆయుధం నాకు కావాలంటే నాకు కావాలంటూ పిల్లదెయ్యాలన్నీ ఎగబడ్డాయి.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.