అలవాటులో పొరపాటు

ఫేస్‌బుక్‌లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న కథ ఇది... కొందరు శాస్త్రవేత్తలు ఐదు కోతులను ఒకే గదిలో పెట్టారట. ఆ గది మధ్యలో ఓ పెద్ద బల్లని ఉంచారు శాస్త్రవేత్తలు. ఆ బల్ల మీద వాళ్లు రోజూ ఒక తాజా అరటిపండుని ఉంచేవారట. గదిలో ఉన్న కోతుల్లో ఒకటి ఆ అరటిపండు కోసం బల్ల ఎక్కేందుకు ప్రయత్నించగానే... కింద ఉన్న మిగతా కోతుల మీద చల్లటి నీళ్లను కుమ్మరించేవారు శాస్త్రవేత్తలు. అంటే అరటిపండు కోసం పైకి వెళ్లే కోతి వల్ల కింద ఉన్న కోతులకి శిక్షపడేదన్నమాట. దాంతో కొన్నాళ్లకి ఆ కోతులు పైకి ఎక్కేందుకు సాహసించడం మానేశాయి. ఒకవేళ ఏదన్నా కోతికి నోరూరి బల్లని ఎక్కేందుకు ప్రయత్నించగానే, మిగతా కోతులన్నీ కలిసి దాన్ని లాగిపారేసేవి.

 

కొద్ది రోజుల తరువాత ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు ఓ చిన్న మార్పుని తీసుకువచ్చారు. ఆ అయిదు కోతుల్లో ఒకదాన్ని బయటకు తీసుకువెళ్లిపోయి, దాని స్థానంలో ఒక కొత్త కోతిని ప్రవేశపెట్టారు. ఈ కొత్త కోతి అరటిపండుని చూడగానే గభాలున బల్లని ఎక్కేందుకు సిద్ధపడిపోయింది. కానీ వెంటనే ప్రమాదాన్ని గ్రహించిన మిగతా కోతులు, దాన్ని దబదబా కిందకి లాగేశాయి. ఇలా రెండు మూడుసార్లు తన్నులు తిన్న తరువాత, కొత్త కోతి కూడా మిగతా కోతులలాగానే నిమ్మళంగా ఉండిపోయిది. ఒకో వారం గడుస్తున్న కొద్దీ శాస్త్రవేత్తలు ఒకో పాత కోతికి బదులుగా మరో కొత్త కోతిని గదిలో ఉంచసాగారు. కొంతకాలం గడిచేసరికి కొత్త కోతులు అక్కడి వాతావరణానికి, మిగతా కోతుల స్వభావానికి అలవాటుపడిపోయాయి, తాము కూడా అందుకు అనుగుణంగానే ప్రవర్తించడం నేర్చుకునేవి. కొన్నాళ్లకి ఆ గదిలో పాత కోతులేవీ లేకుండా పోయాయి. కొత్త కోతులకి చన్నీళ్లతో విధించే శిక్ష అసలేమాత్రం అనుభవం లేదు. అయినా కూడా ఎప్పుడన్నా ఓ కోతి ఆదమరచి అరటిపండు కోసం బల్ల దగ్గరకు చేరుకోగానే, మిగతా కోతులన్నీ కలిసి దాన్ని కరిచి పారేయడం మానలేదు!!!

 

కొందరు మనుషులు కూడా బహుశా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారేమో! ఒక పనిని తాము ఎందుకు చేస్తున్నామో చాలా మంది ఆలోచించరు. దాని వల్ల తనకు ఎలాగూ నష్టం కలుగుతుంది. ఇతరులకు కూడా తన చర్య వల్ల నష్టం కలుగుతున్నా, వీళ్లు తమ తీరుని మార్చుకోరు. ఒక్కసారి మన మొండివైఖరిని పక్కకి పెట్టి విచక్షణకు పదును పెడితే, జీవితంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఈ కథ చెబుతోంది. ఆ పరిష్కారం వల్ల మనం ముందుకు సాగడమే కాదు, ఇతరులను కూడా విజయం వైపుగా నడిపించేందుకు దోహదపడిన వారమవుతాం. లేకపోతే...

 

..Nirjara