జీవితసత్యాన్ని చెప్పే కథ

 

ఇది చాలాకాలం క్రితం జరిగిన కథ. అప్పట్లో ఓ కుర్రవాడు ఉండేవాడు. అతనికి జీవితసత్యం ఏమిటో తెలుసుకోవాలని తెగ తపనగా ఉండేది. ఆ తపనతో అతను ఎక్కడెక్కడో వెతికాడు. ఎవరెవరినో కలిశాడు. అతను వెళ్లిన చోట, అతను కలిసినవారు రకరకాల జవాబులు చెప్పారు. కానీ వాటిలో ఏ ఒక్క జవాబు అతనికి తృప్తిగా తోచలేదు. కుర్రవాడు అలా తిరుగుతూ తిరుగతూ ఉండగా అతనికి ఎవరో ఓ సలహా చెప్పారు. ‘చూడు! ఇలా ఎంత తిరిగినా నీకు తగిన సమాధానం దొరకడు. ఈ ఊరి చివర ఉన్న అడవి మధ్యలో ఒక పాత బావి కనిపిస్తుంది. ఆ బావిలోకి తొంగిచూసి ఎవరైనా తమ మనసులోని ప్రశ్నని అడిగితే, తప్పకుండా జవాబు లభిస్తుంది,’ అని అన్నారు.

 

ఆ సలహా విన్న కుర్రవాడు బావి దగ్గరకు వెళ్లనే వెళ్లాడు. అందులోకి తొంగిచూసి... ’జీవిత సత్యం ఏమిటి?’ అని అడిగాడు. ‘ఈ అడవి దాటిన తర్వాత ఒక చిన్న గ్రామం కనిపిస్తుంది. ఆ గ్రామంలో మూడో కూడలి దగ్గరకి వెళ్లి చూడు. అక్కడ నీకు జీవిత సత్యం ఏమిటో అర్థమవుతుంది,’ అని చెప్పింది బావి. బావి చెప్పినట్లుగానే, కుర్రవాడు అడవి తర్వాత వచ్చే గ్రామానికి వెళ్లాడు. ఆ గ్రామంలోని మూడో కూడలి దగ్గరకు వెళ్లి నిల్చొన్నాడు. అక్కడ అతనికి మూడు దుకాణాలు తప్ప మరేమీ కనిపించలేదు. మొదటి దుకాణంలో ఇనప ముక్కలు అమ్ముతున్నారు, రెండోది కలప దుకాణం, మూడుదాన్లో తీగలు అమ్మకానికి ఉన్నాయి. అంతకుమించి వాటిలో ఎలాంటి ప్రత్యేకతా ఆ కుర్రవాడికి కనిపించలేదు. వాటిలో జీవిత సత్యం ఏమిటో ఆ కుర్రవాడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కుర్రవాడు నిరాశతో మళ్లీ బావి దగ్గరకు వెళ్లాడు. ‘నువ్వు చెప్పినట్లుగానే నేను ఆ కూడలి దగ్గరకు వెళ్లాను. అక్కడ ఓ మూడు దుకాణాలు తప్ప మరేమీ కనిపించలేదు. వాటిలో జీవితసత్యం ఏముందో నాకు అర్థం కాలేదు!’ అని నిష్టూరమాడాడు.

 

‘కంగారుపడకు. వాటిలో దాగిన జీవితసత్యం నీకు నిదానంగా బోధపడుతుంది. ఆ పరిపక్వత నీకు వచ్చిన రోజున నేను చెప్పిన జవాబు తప్పు కాదని తెలుస్తుంది,’ అని బదులిచ్చింది బావి. కుర్రవాడు ఉసూరుమంటూ తన గ్రామానికి చేరుకున్నాడు. ఆ తర్వాత తన రోజువారీ పనులలో పడిపోయాడు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కుర్రవాడికి వయసు, ఆ వయసుతో పాటుగా లోకజ్ఞానం పెరిగింది. జీవితం మీద తనకంటూ కొంత అవగాహన ఏర్పడింది. అలాంటి ఒక రోజున అతను పడుకుని ఉండగా... ఎక్కడి నుంచో ఒక సితార మోగుతున్న సంగీతం వినిపించింది. ఆ మధురమైన సంగీతం అతన్ని ఎంతగానో ఆకర్షించింది. ఆ సంగీతం వింటూ అతను పరివశించిపోయడు. హఠాత్తుగా... ఆ సంగీతంలో అతనికి జీవితసత్యం స్ఫురించింది. లోహం, చెక్క, లోహపు తీగలు... ఈ మూడు విడివిడిగా ఎందుకూ పనికిరాని చెత్తలాగా కనిపిస్తాయి. కానీ ఈ మూడింటి కలియికతో సితార్లాంటి అందమైన వాయిద్యం రూపొందుతుంది. ఆ వాయిద్యాన్ని మీటితే అద్భుతమైన సంగీతం జనిస్తుంది. జీవితం కూడా ఇంతే! జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి కావల్సిన ముడిసరుకు అంతా ప్రకృతి మనకు ఇచ్చింది. కానీ మనలో ఉన్న సమార్థ్యాన్ని మర్చిపోయి... ఎందుకూ పనికిరానివారమని మధనపడిపోతాం. విధి మనకి అన్యాయం చేసిందని ఆరోపిస్తాం. నిజంగా సరైన విచక్షణే ఉంటే... కనిపించని విధి మీద నిందలు వేయడం మాని, అందుబాటులో ఉన్న వనరులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తాం. ఇదే అన్నింటికీ మించిన జీవితసత్యం!

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.