అబద్ధాల గురించి కొన్ని నిజాలు...

ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు వాళ్ళు నిజం చెబుతున్నారా? అబద్ధం చెబుతున్నారా? అన్నది సులువుగా గుర్తించవచ్చుట. ఎదుటివారి ప్రవర్తన, వారి కాళ్ళు, చేతుల కదలిక, మాట తీరు ఇవన్నీ వారి నిజాయితీని ఇట్టే పట్టిస్తాయిట. ఉదాహరణకి ఎవరైనా మన ఎదురుగా నుంచుని సూటిగా కళ్ళలోకి చూడకుండా అటు ఇటు చూసి మాట్లాడుతుంటే తప్పకుండా వాళ్ళు చెప్పేది నిజం మాత్రం కాదన్నమాటే. అలాగే ఒకటే పనిగా చెవి వెనక, ముఖం పైన చేతులతో రుద్దుతూ వున్నా వాళ్ళు అబద్ధం చెబుతున్నారని అర్థం.

గ్యాప్ తీసుకుంటే...

మీరు ప్రస్తావించిన ఏ అంశం గురించి అయినా ఎదుటి వారు కొద్దిసేపు సమయం తీసుకుని ప్రతిస్పందించారనుకోండి... వాళ్ళు అబద్ధం చెబుతున్నారని అర్థం. ఎందుకంటే అబద్ధం చెప్పేటప్పుడు ఎమోషనల్‌గా రెస్పాండ్ అవడానికి ఓ చిన్న పాజ్ తీసుకుంటామట ఎవరైనా. అలాగే మన మాటలకి, చేతలకి కూడా కొద్దిపాటి తేడా వుంటుందిట. మొదట మాటలతో రెస్పాండ్ అయి, ఆ తర్వాత మనం చేతలు కలుపుతాం అన్నమాట. ఉదాహరణకి ఎవరో నచ్చని మనిషి కనిపించగానే ‘‘అరె.. నిన్నిలా కలవటం భలే హ్యాపీగా వుంది’’ అని అంటాం. ఆ తర్వాత నెమ్మదిగా షేక్‌హ్యాండ్ ఇస్తాం. నిజానికి తనని అలా కలవటం ఇష్టం లేదన్న విషయం మన మాటలకి, చేతలకి మధ్య చిన్నపాటి తేడాని తెస్తుంది.

భాషే తప్ప భావం లేకుంటే...

అబద్ధం చెప్పేటప్పుడు మనకి తెలీకుండానే మన ఫీలింగ్స్‌ మన శారీరక కదలికలలో బయటపడతాయిట. ‘‘భలే ఆశ్చర్యంగా వుందే’’ అంటుంటే నిజానికి ఆ ఆశ్చర్యం మన మాటతోపాటు ముఖంలో కూడా కనిపించాలి. కానీ, మనం ఆశ్చర్యపోవడం నిజం కానప్పుడు అది కేవలం మాటలకే పరిమితం అవుతుంది. ముఖంలో ఆ ఎక్స్‌ప్రెషన్ వుండదు. అలాగే బాధ, సంతోషం... ఇలా ఏదైనా సరే ఆ ఎమోషన్ మాటతోపాటు ముఖ కవళికల్లో కనిపిస్తేనే అది నిజమని అర్ధం చేసుకోవాలి. అలాగే నిజం చెప్పే మనిషి ఎప్పుడూ పోట్లాటకి దిగడు. ఎదురుతిరిగి పోట్లాడ్డం మొదలుపెడితే అర్థం... వాళ్ళు తమని తాము రక్షించుకునే ప్రయత్నంలో డిఫెన్సివ్‌గా మనతో గొడవకి దిగుతున్నారని... కాబట్టి వాళ్ళు అలా గొడవకి దిగగానే అబద్ధం చెప్పారని తెలుసుకుని మని అప్పటికి ఆ విషయాన్ని వదిలేయడం మంచిది.

ఇవీ అబద్ధాలకి సంకేతాలే...

ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుతూ వుండగా ఎదుటి వ్యక్తి మనతో ఏదో చెబుతూ మధ్యలో పక్కనున్న ఏ వస్తువులనో తీసి ఇద్దరి మధ్య పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ తీయడం చేయడం వాళ్ళు అబద్ధం చెబుతున్నారని, దానిని ఇలా వ్యక్తం చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఏదో విషయాన్ని సీరియస్‌గా చెబుతూ అటు, ఇటు చూడటం, కూర్చున్న చోటులో కదలటం, తలని ముందుకు వెనక్కి అనడం ఇవన్నీ ఎదుటి వ్యక్తి అబద్ధం చెబుతున్నాడని ఇట్టే పట్టించే అంశాలు. అలాగే మనం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా తల ఆడించడం, అవును - కాదు అని పొడిపొడిగా సమాధానాలు చెప్పడం వంటివి కూడా అబద్ధాలకి సంకేతాలే.

టాపిక్ మార్చి చూడండి...

ఎవరైనా మీతో అబద్ధం చెబుతున్నారేమో అనే అనుమానం వస్తే వెంటనే ఠక్కున మీరు మాట్లాడుతున్న టాపిక్‌ని మార్చేయండి. నిజం చెబుతున్నవాళ్ళు మీరు డైవర్ట్ చేసినా మళ్ళీ మళ్ళీ వాళ్ళు చెప్పే విషయంలోకే వస్తారు. అదే అబద్ధం చెప్పేవాళ్ళు హమ్మయ్య అనుకుని మారిన టాపిక్‌పై మాట్లాడ్డం మొదలుపెడతారు. ఇది ఒక చిన్న టెస్ట్ అన్నమాట.

కొన్ని మినహాయింపులూ...

అబద్ధాన్ని కనిపెట్టడం తెలుసుకున్నాం కదా అని అందరి చర్యలనీ ఈ దృష్టితో చూడకూడదు. వాళ్ళ మీద వీటిని ప్రయోగించకూడదు. ఎందుకంటే కొందరికి కొన్ని అలవాట్లు స్వభావసిద్ధంగా వుంటాయి. కాబట్టి అవసరమనుకున్నప్పుడు, మనకు అసలు విషయం తెలియడానికి ఈ ‘నాలెడ్జ్’ని వాడుకోవాలి... సరేనా...