శాసన మండలి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసిన అధికార పక్షం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు తలుపులు మూసేసి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపి వేసి విభజన చట్టాన్ని ఆమోదించామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి అక్కడ ఏం జరిగిందో రికార్డులు కూడా లేవు. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి నేతలు విభజన రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టులో పిటిషన్ లు వేశారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మూడు రాజధానుల నిర్ణయానికి శాసన మండలిలో ఆమోదించుకోవటానికి ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసింది. లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియనివ్వకుండా అధికార పక్షం వ్యవహరిస్తోంది. రూల్ నెంబరు 71 ప్రకారం అసలు వికేంద్రీకరణ చట్టాన్ని చర్చ చేపట్టకుండానే తిరస్కరించటానికి టిడిపి ప్లాన్ సిద్ధం చేసింది. ఈ కారణంగానే లోపల గందరగోళం ఏర్పడింది. 

రూల్ నెంబరు 71 గురించి ఏమాత్రం ఊహించని వైసిపి మండలి ప్రసారాలను వెంటనే నిలిపివేయించింది. మండలి సభ్యులు కాని 14 మంది మంత్రులు శాసన మండలికి వచ్చారు. వారందరూ మండలి చైర్మన్ పై వత్తిడి తెచ్చారు. మండలిని రద్దు చేస్తామని అలాగే ఎమ్మెల్సీలకూ ప్రలోభాలు కూడా చూపిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపించారు. ఎలాగైనా బిల్లును ఆమోదించకున్నా అనిపించుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. ఎప్పుడూలేని విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మండలి గ్యాలరీలో ఉదయం నుంచి ఉన్నారు. వివిధ సందర్భాల్లో వారు ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.మండలి ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసిన ప్రభుత్వం లోపల జరుగుతున్న వాటి పై గందరగోళ సమాచారాన్ని బయటకు పంపుతుంది. బిల్లులూ మండలిలో ప్రవేశపెట్టారని రూల్ 71 పై చర్చ తర్వాత వికేంద్రీకరణ బిల్లుపై దృష్టి సారిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే టిడిపి మాత్రం అలాంటిదేం జరగలేదని , మండలి కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం లేకపోవటంతో ప్రభుత్వం రాజకీయ కుట్ర చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపి వేయడం పై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలు ఏం చూడకూడదని ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారని టిడిపి ప్రశ్నిస్తుంది. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయడంలో అధికార పక్షం ఏదైనా వ్యూహం వహిస్తొందా లేక ఎందుకు నిలిపివేశారు అన్న అంశం పై తీవ్ర చర్చ నడుస్తొంది.