రెక్కలు రానున్న తెలంగాణ భూముల మర్కెట్ విలువ...

 

తెలంగాణలో భూముల మార్కెట్ విలువకు త్వరలో భారీగా పెరగనున్నాయి.భూముల మార్కెట్ విలువలను శాస్త్రీయంగా అంచనా వెయ్యాలి అంటూ స్టాంపులు రిజిస్ట్రేషన్ ల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రాంతాల వారీగా ఉన్న బహిరంగ మార్కెట్ విలువలను ఆధారంగా చేసుకొని రేట్లను నిర్ణయించాలని సూచించింది. ఇప్పటికే కొత్త మార్కెట్ విలువలతో ప్రతిపాదనలనూ స్టాంపులు రిజిస్ట్రేషన్ ల ఇన్ స్పెక్టర్ జనరల్ కార్యాలయం తయారు చేసింది. ఆయా ప్రాంతాలకు  అనుగుణంగా 35 నుంచి 150% వరకు మార్కెట్ విలువలను పెంచుతూ వీటిని రూపొందించింది.పెంపు ప్రతిపాదనలను ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి సోమేష్ కుమార్ కు అందచేసింది. ఈ ప్రతిపాదనలను పునః పరిశీలించాలి అంటూ తిరిగి రిజిస్ర్టేషన్ల శాఖ ఇన్ స్పెక్టర్ జనరల్ ను ఆదేశించారు. కొత్తగా రాబోతున్న పారిశ్రామిక కారిడార్ లు క్లస్టర్ లు ముఖ్యమైన వాణిజ్య ప్రాంతాలను ఆధారంగా చేసుకొని రేట్లను అంచనా వేయాలని ఆదేశించారు.

మార్కెట్ రేట్లతో పోల్చి చూస్తే ప్రభుత్వ మార్కెట్ విలువలు శాస్త్రీయంగా నిక్కచ్చిగా ఉండాలని సూచించారు. దీంతో రిజిస్టేషన్ల అధికారులు మళ్లీ కసరత్తు మొదలు పెట్టారు. ఏ ప్రాంతంలో బహిరంగ మార్కెట్ విలువ ఎంతుంది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందన్న వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ప్రైవేటు రంగంలో వైద్య కళాశాలలు వెలుస్తున్నాయి. ములుగు ప్రాంతంలో ఉద్యానవన యూనివర్శిటీ అందుబాటులోకి వచ్చింది. గిరిజన వర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వంటివి ఏర్పాటు కావాల్సి ఉంది. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, డిండి వంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి. కొన్ని జాతీయ రహదారుల విస్తరణ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ లను తయారు చేసి కేంద్రానికి అందజేసింది.ఇలాంటి ప్రాజెక్టులు, కారిడార్లు, హైవేలు, విద్యా సంస్థలు ఏర్పడే ప్రాంతాల చుట్టుప్రక్కల భూములు స్థలాల విలువలు అనూహ్యంగా పెరగనున్నాయి. ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మార్కెట్ విలువలను రూపొందించనున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి అర్బన్ ప్రాంతాల్లో లెక్కలోకి రానున్నాయి. 

జూబ్లీహిల్స్ లో ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో గజం ధర లక్షకు పైగానే పలుకుతోంది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధర మాత్రం ఇప్పటికీ నలభై వేల రూపాయలే ఉంది. ఇలా పెరిగిన రేట్లను పరిగణనలోకి తీసుకొని శాస్త్రీయంగా మార్కెట్ విలువలను అంచనా వేయనున్నారు. చాలా చోట్ల వంద శాతానికి పైగా రేట్లు పెరిగాయి.కొన్ని చోట్ల 150 నుంచి 250 శాతం వరకు రేట్లను పెంచిన ఆశ్చర్యపోనక్కర్లేదని అధికార వర్గా లు చెప్తున్నాయి. త్వరలో ప్రభుత్వ మార్కెట్ విలువల పెంపు పై అధికారికంగా ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు.తెలంగాణలో సామాన్య ప్రజలు ముందుముందు భూములు కొనాలంటే నిజంగానే భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి.