అయ్యో లాలూ.. నీకే ఎందుకిలా..?

 

భారతదేశంలో న్యాయం.. డబ్బు, పరపతి ఉన్న వాడికి ఒకలా.. పేదవాడికి ఒకలా దొరుకుతాయని తరతరాలుగా వస్తోన్న నానుడి. దీనికి నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఉదాహరణలు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ సొంతడబ్బులా దేశం దాటించిన బడాబాబులపై కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు ఎన్నో కేసులు.. ఎన్నో వాదనలు. కానీ వాటిలో ఏ ఒక్క దానిలోనూ నిందితులకు శిక్ష పడిన దాఖలాలు చాలా తక్కువ.. అప్పటికే సంవత్సరాల తరబడి వాయిదాలు, కౌంటర్లు, రీకౌంటర్లతో పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. మరోవైపు అయా కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారు ధనవంతులో..సెలబ్రెటీలో.. రాజకీయ వ్యవస్థ అండదండలో ఉన్నవారైతే సులభంగా కేసుల నుంచి గట్టెక్కెస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ టైంలో వన్యప్రాణులను వేటాడటం, తప్పతాగి రోడ్డు మీద నిద్రిస్తున్న వారి ప్రాణాలు తీసిన కేసులో నిందితుడిగా ఉన్న బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఎంత హాయిగా సినిమాలు తీసుకుంటూ.. కోట్లు సంపాదిస్తున్నాడో తెలిసిందే..

 

అంతెందుకు దేశంలో ప్రకంపనలు సష్టించి.. నాటి యూపీఏ ప్రభుత్వం పతనానికి నాంది పలికిన సంఘటనగా చెప్పుకునే 2జీ స్పెక్టం కుంభకోణంపై.. రెండు రోజుల క్రితం వచ్చిన తీర్పు పై సమాధానం తెలిసినా సవాలక్ష ప్రశ్నలు సంధిస్తోంది దేశం. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో రూ.1.76 లక్షల కోట్ల విలువైన అవకతవకలు జరిగాయంటూ సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక స్పష్టం చేసింది. సీబీఐ, ఈడీల దర్యాప్తులోనూ ఎన్నో అక్రమాలు బయటకు వచ్చాయి. కేసు ఇంత బలంగా ఉన్నప్పటికీ నిందితులుగా ఆరోపణలు ఎదుర్కోన్న 17 మంది నిర్దోషులుగా బయటకు వచ్చారు. దీనిని దేశం ఇంకా మరచిపోకముందే ఇవాళ మరో కీలక తీర్పు వెలువడనుందని మీడియాలో హడావిడి కనిపించింది.

 

1990-97 మధ్యకాలంలో బీహర్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. దాణా కోనుగోళ్లలో 900 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై 25 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం ఇవాళ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును వెలువరిస్తున్నట్లు ప్రకటించింది. ఇది చూసిన దేశప్రజలు.. హా.. ఏముంది లాలూ కూడా అందరిలాగే బయటపడతారులే అన్నట్లు తమ పనుల్లో తాము మునిగిపోయారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా లాలూతో పాటు మరో 15 మందిని దోషులుగా ప్రకటిస్తూ రాంచీలోని  సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. అయితే తనకంటే పెద్ద పెద్ద స్కాములు చేసిన వారు నిర్దోషులుగా బయట తిరుగుతుంటే.. తనకు మాత్రమే ఇలా ఎందుకు జరిగిందోనని లాలూ తలపట్టుకున్నాడట. అయితే అసలు నిజం ఏంటో లాలూ అంతరాత్మకు.. భారతీయులందరికీ తెలుసంటున్నారు రాజకీయ విశ్లేషకులు.