గజ్వేల్ లో ఎవరు గెలుస్తారో? చెప్పడం ఇష్టం లేదు: లగడపాటి

 

తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు ప్రజకూటమికే అనుకూలంగా ఉన్నాయని నిన్న లగడపాటి రాజగోపాల్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే లగడపాటి ఒకప్పుడు టీఆర్ఎస్ కి అనుకూలంగా సర్వే ఉందని చెప్పి.. ఇప్పుడు ఒత్తిడి వల్ల మాట మారుస్తున్నారు. ఆయన మాటలు ప్రజలు పట్టించుకోవద్దు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే దీనిపై తాజాగా లగడపాటి స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు. ఒత్తిడితో సర్వేను మార్చానని కేటీఆర్‌ అనడం విడ్డూరంగా ఉందన్నారు. సెప్టెంబర్‌ 16న తన బంధువు ఇంట్లో కేటీఆర్‌ కలిశారని.. అప్పుడే సర్వే గురించి కేటీఆర్‌ తనను అడిగినట్లు చెప్పారు. సర్వే రిపోర్టులు పంపిస్తానంటే కేటీఆర్‌ మెయిల్‌ అడ్రస్‌ కూడా ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, కోదండరాం విడివిడిగా ఉన్నప్పుడు ఆ సర్వే చేశామని లగడపాటి చెప్పుకొచ్చారు. వారందరూ కలిస్తే పోటాపోటీగా ఉంటుందని కూడా కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు. టీడీపీ బలం టీఆర్ఎస్‌కు కలిస్తే.. విజయం ఏకపక్షమవుతుందని అన్నానన్నారు. పొత్తులతో వెళ్లాలని తాను సూచించినప్పటికీ.. కేటీఆర్ మాత్రం ఒంటరిపోరుతోనే విజయం సాధిస్తానని తెలిపారన్నారు. 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు.
 
కేటీఆర్‌ 23 నియోజకవర్గాల జాబితా పంపించి సర్వే ఫలితాలు కోరారని, నవంబర్‌ 11న కేటీఆర్‌ మరో 37 నియోజకవర్గాల జాబితా పంపారన్నారు. 37 నియోజకవర్గాల విషయంలో సర్వే చేయగా.. కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యం ఉందని కేటీఆర్‌కు మెసేజ్‌ పెట్టా. పోటా పోటీగా ఉన్నప్పుడు అభ్యర్థులే ప్రధానం అవుతారని చెప్పా. మళ్లీ నవంబర్‌ 20న మరోసారి మెసేజ్‌ పెట్టా. అప్పటికీ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం చూసి టీఆర్ఎస్ 65-70 వస్తాయని చెప్పా. వాళ్లకు 35 నుంచి 40 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేశా. దీనిపై కేటీఆర్‌ స్పందించి దానికంటే ఎక్కువే వస్తాయని నాకు బదులిచ్చారు. ఆ తర్వాత ప్రజల ఆలోచన వేగంగా మారింది అన్నారు. నవంబర్‌ 28 తర్వాత తనకు అనేక రిపోర్టులు వచ్చాయని, ఏ రిపోర్ట్‌ను ఎవరితో షేర్‌ చేసుకోలేదన్నారు. 8 మంది ఇండిపెండెట్లు గెలుస్తారని చెప్పానని.. ఏ పార్టీకి వ్యతిరేకంగా చెప్పలేదని లగడపాటి పేర్కొన్నారు. మొన్నటి దాకా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న వరంగల్‌ జిల్లాలో కూడా కాంగ్రెస్‌ ఆధిక్యత ఉందని.. ఈ ఉదయమే సమాచారం వచ్చిందన్నారు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, ఎస్టీ రిజర్వేషన్లు, మూడెకరాల భూమి విషయంలో ఎస్సీ, ఎస్టీలు టీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ రూ.2 లక్షల రుణమాఫీ హామీ బాగా పనిచేసిందని లగడపాటి చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని లగడపాటి అన్నారు. ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దని తెలిపారు. కేటీఆర్, తన మధ్య ఎలాంటి గొడవలు లేవని అన్నారు. అలాగే తాను ఎప్పుడూ బోగస్ సర్వేలు చేయలేదని లగడపాటి స్పష్టం చేశారు.

కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో పరిస్థితి గురించి లగడపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 28న తాను గజ్వేల్ కు వెళ్లానని వెల్లడించారు. పోలీసులు తనిఖీల్లో భాగంగా తన కారును ఆపారన్నారు. తనను వారు గుర్తుపడతారని అనుకోలేదనీ, కానీ ఓ కానిస్టేబుల్ గుర్తుపట్టి కారు దిగమని కోరారని వివరించారు. తనతో వారు సెల్ఫీలు దిగారన్నారు. గజ్వేల్ లో పరిస్థితి ఎలా ఉందని అక్కడి కానిస్టేబుళ్లను తాను అడిగానన్నారు. దానికి ‘పోతారు సార్’ అని ఏడుగురు కానిస్టేబుళ్లు బదులిచ్చారన్నారు. గజ్వేల్ లో ఎవరు పోతారో? ఎవరు గెలుస్తారో? ఇప్పుడే బయటపెట్టడం తనకు ఇష్టం లేదని లగడపాటి వ్యాఖ్యానించారు.