లాలిపాటతో డిప్రెషన్ దూరం

 

నెలల వయసు పసికందుని చూసి తల్లి నిశబ్దంగా ఉండగలదా! ఆ పిల్లవాడు ఏడుస్తుంటే ఓదార్చేందుకు తన గొంతు విప్పకుండా ఉంటుందా! అందుకే ప్రపంచంలో ఏ పురాణాలూ, కావ్యాలూ పుట్టకముందే లాలిపాటలు పుట్టి ఉంటాయి. అలాంటి లాలా పాటలను ఏవో లల్లాయి పదాల్లాగా తీసిపారేయవద్దని సూచిస్తున్నారు పరిశోధకులు.

 

లాలిపాటల గురించి పరిశోధనలు జరగడం కొత్తేమీ కాదు. లాలిపాటల వల్లే మాతృభాష పిల్లలకు అలవడుతుందనీ, తల్లీబిడ్డల మధ్య సంబంధం మెరుగుపడుతుందనీ ఇప్పటికే అనేక పరిశోధనలు నిరూపించాయి. మియామీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మరో అడుగు ముందుకు వేసి, లాలిపాటల వల్ల అటు తల్లి మీదా ఇటు బిడ్డ మీదా ఎలాంటి ప్రభావం ఉంటుందో గమనించే ప్రయత్నం చేశారు.

 

ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు ఓ 70 మంది పసిపిల్లలను ఎన్నుకొన్నారు. వీరికి ఆరురకాల శబ్దాలను వినిపించారు. వీటిలో తల్లి తన బిడ్డ కోసం పాడే పాట, ఎవరో ఆగంతకుడు పాడే పాట, మ్యూజిక్ సిస్టమ్ నుంచి వచ్చే సంగీతం, పుస్తకం చదివి వినిపించడం... వంటి శబ్దాలు ఉన్నాయి. వీటన్నింటిలోకీ తల్లి తన కోసం పాట పాడినప్పుడే, పిల్లవాడి మెదడు చురుగ్గా ప్రతిస్పందిస్తున్నట్లు గమనించారు. పిల్లవాడి మానసిక ఎదుగుదలకు లాలిపాటలు ఉపయోగపడుతున్నట్లు తేలింది.

 

పిల్లల సంగతి అలా ఉంచితే మరి తల్లి పరిస్థితి ఏమిటి? దానికీ జవాబు కనుగొన్నారు పరిశోధకులు. పిల్లలు పుట్టిన తరువాత శరీరంలో ఏర్పడే మార్పుల వల్ల తల్లులలో డిప్రెషన్ తలెత్తే ప్రమాదం ఉంది. పిల్లల వంక చూస్తూ, వారి ప్రతిస్పందనలకి అనుగుణంగా స్వరంలో మార్పులు చేస్తూ.... లాలిపాటలు పాడటం వల్ల అలాంటి డిప్రెషన్ చిటికెలో తీరిపోతుందంటున్నారు. మరింకేం! స్వరం గురించి సంకోచం లేకుండా మీ గొంతుని చిన్నారి ముందు విప్పండి.

- నిర్జర.