కోదండరాం కనీసం సర్పంచిగా కూడా గెలవరు

 

2014లో తెదేపాకు ప్రజలు రెండంకెల స్థానాలను ఇచ్చారని,మహాకూటమి అధికారంలోకి వచ్చేందుకు తాను, రావుల స్థానాలను ప్రస్తుతం త్యాగం చేశామని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు రమణ తెలిపారు.ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.కేసీఆర్‌ అర్ధాంతరంగా ప్రభుత్వాన్ని రద్దు చేశారని విమర్శించారు. కేసీఆర్‌ దొరల పాలన కొనసాగిస్తున్నారని,దానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు.గత ఎన్నికల్లో ప్రజలు తెరాసకు 63 సీట్లు ఇస్తే వాటిని అక్రమంగా 93కి పెంచుకున్నారని ఆరోపించారు. తెరాస నాయకులతో సంప్రదించకుండా సొంత నిర్ణయంతో కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించారని,ఆ నిర్ణయం ప్రజల్లో తిరస్కరణకు గురైందన్నారు.ఎంతో మంది ప్రాణ త్యాగాలతో తెలంగాణ వచ్చిందని,అలాంటి తెలంగాణలో ప్రజల అభిప్రాయానికి విలువ లేకుండా పోయిందని రమణ పేర్కొన్నారు.

తెరాస ప్రభుత్వం గత 51 నెలల్లో ఖర్చు చేసిన రూ. 8 లక్షల కోట్లకు కేసీఆర్‌ లెక్క చెప్పాలని రమణ డిమాండ్‌ చేశారు.ఆ పార్టీ ప్రచారానికి ఖర్చు చేస్తున్న వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని నిలదీశారు.కోదండరామ్‌ కనీసం సర్పంచిగా గెలవరన్న కేసీఆర్‌ ఎందుకు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారని రమణ ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రానికి గులాబీ చీడ పట్టిందని.. దానిని తమ కూటమి వదిలిస్తుందని స్పష్టం చేశారు.