కర్నూలు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు..?

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల నగరా మోగింది. శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో.. ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అధికార పార్టీ నుంచి అభ్యర్థిని ఖరారు చేయడం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. మంగళవారం సాయంత్రానికి నామినేషన్ గడువు ముగుస్తుండటంతో అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలన్న దానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. దీంతో పార్టీ సీనియర్ నేతలు.. కర్నూలు జిల్లా నాయకులతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.

 

టికెట్ కోసం చాలా మంది ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. కేఈ ప్రభాకర్, ఎం. శివానందరెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డిలో ఎవరిని ఎంపిక చేస్తారని జిల్లా మొత్తం ఉత్కంఠగా ఎదురచూస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్న శిల్పాచక్రపాణి రెడ్డి నంద్యాల ఉపఎన్నికకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. పార్టీ సభ్యత్వంతో పాటు పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మల్సీ పదవికి కూడా శిల్పా రాజీనామా చేయడంతో.. ఈ స్థానంలో ఖాళీ అయ్యింది.

 

వైసీపీ బలంగా ఉన్న కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో నాడు దివంగత భూమా నాగిరెడ్డి అండతో శిల్పా గెలుపొందారు. అలాంటి చోట మరోసారి ఎన్నికలు రావడంతో ప్రతిపక్షం సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. అలాగే నంద్యాల ఉపఎన్నికతో డీలా పడిన శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు. అయితే సరైన అభ్యర్థుల కోసం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ పదవిని కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన వారికే ఇవ్వాలని ఓ వర్గం.. గతంలో ప్రాతినిధ్యం వహించిన సామాజిక వర్గానికే ఇవ్వాలని మరో వర్గం గట్టిగా పట్టుబడుతున్నాయి. అయితే సీఎం మనసులో ఏముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.