మళ్ళీ మొదటికి కర్ణాటకం...సుప్రీం తలుపుతట్టనున్న స్పీకర్ !

 

గత నెలరోజులుగా కర్ణాటక రాజకీయాలు ఒక పొలిటికల్ థ్రిల్లర్‌ మూవీని తలపిస్తున్నాయి. ముందు ఎమ్మెల్యేల రాజీనామా వారు రహస్య ప్రదేశానికి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన మంత్రిని సైతం అరెస్ట్ చేయించి బీజేపీ వెనకి పంపడం అలా రకరకాల ట్విస్ట్ లతో కూడిన ఈ సంక్షోభం నిన్నటితో ముగుస్తుందని అనుకున్నారు. విశ్వాస పరీక్షకు ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సిద్ధమైనా గురువారం అది జరగకుండానే సభ నేటికి వాయిదా పడింది. 

దీంతో విశ్వాస పరీక్ష జరగకుండా సభను ఎలా వాయిదా వేస్తారంటూ బీజేపీ నిన్న ఆందోళనకు దిగింది. అనూహ్యంగా నిన్న రాత్రి బీజేపీ సభ్యులు అసెంబ్లీలోనే నిద్రించారు. ఎమ్మెల్యేల రాజీనామా అంశంపై నిర్ణయాధికారంలో స్పీకర్‌కు సుప్రీం కోర్టు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నేపథ్యంలో విప్‌ విషయంలో కూడా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ స్పీకర్‌, సీఎం సుప్రీం కోర్టు మెట్లేక్కాలని నిర్ణయించారు. 

నిజానికి ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలలోగా విశ్వాస పరీక్ష నిర్వహించి ప్రభుత్వం భవితవ్యం తేల్చాలంటూ కర్ణాటక గవర్నర్‌ స్పీకర్ ను కోరడంతో అలాగే జరిగి ప్రభుత్వం ఉండడమో ఊడడమో ఏదో ఒకటి జరుగుతుందని అనుకున్నారు. కానీ మళ్ళీ కోర్టుకు వెళ్ళాలని స్పీకర్‌, సీఎం తీసుకున్న నిర్ణయంతో మళ్లీ రాజకీయం రసవత్తరంగా మారింది.  మరోవైపు తమకు పూర్తి మెజార్టీ ఉందని ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందేనని బీజేపీ సభ్యులు పట్టుబడుతున్నారు.