జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్.! త్వరలోనే యువరాజుకి పట్టాభిషేకం?

కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని... కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోతారంటూ ఎప్పట్నుంచో విపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు... ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఎక్కువగా వినిపించింది. ప్రధాని మోడీ సైతం... కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారంటూ ఆరోపణలు చేశారు. విపక్షాల ఆరోపణలు ఎలాగున్నా, తొందర్లోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే మాట టీఆర్ఎస్ వర్గాల్లోనూ వినిపించింది. అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కేటీఆర్ కు ప్రభుత్వ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో తిరుగుబాటు రావొచ్చనే భయంతో కేసీఆర్ వెనకడుగు వేశారని చెబుతారు. అందుకే ముందుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టి టీఆర్ఎస్ నాయకగణమంతా కేటీఆర్ చుట్టూ తిరిగేలా చేశారని అంటారు. ఒకవిధంగా చెప్పాలంటే, అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ చక్రం తిప్పేది కేటీఆరే. టికెట్ల దగ్గర్నుంచి... మంత్రి పదవుల వరకు... అన్నింటిలోనూ కేటీఆర్ మార్క్ కనబడుతుంది.

అయితే, కేటీఆర్ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. కేసీఆర్ వారసుడుగా కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపడతారనే మాట వినిపిస్తోంది. కేసీఆర్ కూడా తన పదవికి తనయుడు కేటీఆర్ కు కట్టబెట్టాలని సీరియస్  గా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ములాయం-అఖిలేష్ మాదిరిగా... పార్టీకి గౌరవాధ్యక్షుడిగా, ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ... జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ మెల్లగా సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొన్నటి ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దల నుంచి కేసీఆర్ కు ఊహించని కామెంట్స్ ఎదురైనట్లు తెలుస్తోంది. ఇక, మీ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేసి, మీరు గౌరవంగా తప్పుకోండంటూ అమిత్ షా వ్యాఖ్యానించినట్లు తెలంగాణ బీజేపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కేంద్ర నాయకత్వం కేసీఆర్ ను టార్గెట్ చేసిందని, దాంతో ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకోక తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ సన్నిహితులైన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు గందరగోళంగా ఉండటంతో... అన్నీ చక్కబడగానే... పార్టీలో ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా, యువరాజు పట్టాభిషేకం జరగడం ఖాయమని అంటున్నారు.