కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ ను విలీనం చేయాలనుకున్నాం: కేటీఆర్‌

 

తాజాగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ  నాలుగేళ్లల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం సాధించిందో వివరించారు. విభజన సమయంలో ఎన్నో అపోహలున్నప్పటికీ తెలంగాణను నెంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, తెలంగాణలో చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్‌ వేదికగా కేంద్రం పేర్కొన్న విషయాన్ని ఆయన‌ గుర్తు చేశారు. నేత కార్మికుల ఆత్మస్థైర్యం పెంపొందేలా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోని 3,400 గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఉద్యమకారుడిగానే కాకుండా మంచి పాలకుడిగానూ నిరూపించుకున్నారన్నారు. తెలంగాణ నాయకులకు పరిపాలన చేతకాదని ప్రచారం చేశారని, తలెత్తుకుని చెప్పుకునే విధంగా పాలించామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశానికే తెలంగాణ తలమానికంగా నిలిచిందని చెప్పారు.

భావితరాలకు విద్యుత్‌కోత అనే పదం తెలియకూడదనే 24 గంటల సరఫరాకు శ్రీకారం చుట్టామని కేటీఆర్ తెలిపారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ను చరిత్ర పుటలకే పరిమితం చేయాలనే ఆలోచనతో ‘మిషన్‌ భగీరథ’ ప్రారంభించామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం సగటున రూ.39.04కోట్లేనని.. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో సగటున ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం వచ్చిందని కేటీఆర్‌ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఇంజినీర్లే ఆశ్చర్యపోతున్నారని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో భూవివాదాలు, దందాలు లేకుండా చేశామన్నారు. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో కర్ఫ్యూ అనేదే లేకుండా చేశామని చెప్పారు. హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ను తొలగించేందుకు తమ ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వలేదని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడలేదన్నారు. పేకాట క్లబ్బులు, గుడుంబా స్థావరాలు లేవని, ఈ నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క అవినీతి మరకలేదని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌వన్‌గా ఉన్నామని, 8వేలకు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, స్కైవేల నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. స్థానిక యువతకే 95శాతం ఉద్యోగాలిచ్చేలా కేసీఆర్‌ కృషి చేశారని, నాలుగేళ్లలో 100కోట్ల మొక్కలు నాటి హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని, 40వేల చెరువులను పునరుద్ధరించామని, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని కేటీఆర్ అన్నారు.

ఒకానొక దశలో కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ ను విలీనం చేయాలని కూడా అనుకున్నామని కేటీఆర్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేసీఆర్‌ వంటి నాయకుడు రాష్ట్రానికి 15ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నది తన ఆకాంక్ష అని వివరించారు. కేసీఆర్ దయవల్ల మంత్రినయ్యానని, ప్రస్తుతం ఉన్న మంత్రి పదవే పెద్దది అనుకుంటున్నానని అన్నారు. కేసీఆర్‌కు చెప్పకుండా జాబ్‌కు రిజైన్ చేసి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పనిచేశానన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సొంతంగా అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, మళ్లీ ప్రజలకు కనిపించనని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నేతలకు ఉందా? అని ప్రశ్నించారు.

ఏపీ సీఎం చంద్రబాబు గిల్లికజ్జాలు పెట్టుకుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పరిణతితో పనులు చేసుకుంటున్నారని తమకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ప్రధాని మోదీయే కితాబిచ్చారని చెప్పారు. తమ ప్రత్యర్థి ఇచ్చిన కితాబును చంద్రబాబులా ప్రచారం చేసుకునే అలవాటు టీఆర్ఎస్ కు లేదన్నారు. హైదరాబాద్‌ను తానే కట్టానంటూ చంద్రబాబు చెప్పుకునే మాటలు విని ప్రజలు నవ్వుకుంటారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. హైద్రాబాద్‌లో ఎవరూ ఏం చేశారో నాలుగు ఏళ్లుగా హైద్రాబాద్ ప్రజలకు తెలుసునని.. డిసెంబర్ 7వ తేదీన  ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు.