వెన్నలాంటి ఆరోగ్యం!

 

ఒకప్పుడు ప్రతి ఇంటా వెన్న చిలికే అలవాటు ఉండేది. పిల్లలు గోరుముద్దలకంటే ఇష్టంగా వెన్నముద్దలనే తినేవారు. వంట చేయడం దగ్గర్నుంచీ ఒంటికి పట్టించడం వరకూ వెన్నని అన్ని రకాలుగానూ వాడుకునేవారు. కానీ రానురానూ ఒపికలు తగ్గిపోయాయి. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. జీవనశైలి తలకిందులైపోయింది. ఇప్పుడు వంటింట్లోంచి వెన్న మాయమైపోయింది. కానీ వెన్న వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుస్తున్న తరువాత మళ్లీ వెన్నని వాడేందుకు జనం ఉత్సాహపడుతున్నారు. ఆ ఆరోగ్య రహస్యాలు ఏమిటంటారా!

 

గుండెకు మంచిది!

వెన్నలో విటమిన్‌ ఏ చాలా అధికమొత్తంలో ఉండటమే కాదు, చాలా త్వరగా శరీరంలో కలిసిపోతుంది కూడా! గుండె, కండరాల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ విటమిన్‌ ఏ చాలా అవసరం. పైగా వెన్నలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కూడా గుండెను దృఢంగా ఉంచుతాయి. విటమిన్‌ ఏ వలన కేవలం గుండెకు మాత్రమే కాదు... థైరాయిడ్‌, అడ్రినల్‌ గ్రంథులు సరిగా పనిచేసేందుకు కూడా చాలా అవసరం.

 

కొవ్వు పెరగదు

వెన్న అన్న మాట వినగానే, అది కొవ్వుని పెంచుతుందేమో అన్న అపోహ సహజం! నిజానికి వెన్నలో ఉండే కొవ్వు పదార్థాల నిర్మాణం, త్వరగా కరిగిపోయేలా రూపొందించబడ్డాయి. దీంతో వెన్నని తినడం వల్ల ఆకలి తీరినట్లు అనిపిస్తుందే కానీ, కొవ్వు మాత్రం పేరుకోదు. అంతేకాదు! మంచి కొలెస్ట్రాల్‌ ఉన్న ఈ వెన్నని తినడం వల్ల పిల్లల మెదడు, నాడీ వ్యవస్థ దృఢంగా రూపొందడానికి దోహదపడుతుంది.

 

పెరుగుదలకు అవసరం

వెన్నలో ఉన్న విటమిన్‌ A,D,E,K2 లు పిల్లల సమగ్రమైన ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఎదిగే వయసులో ఉన్న పిల్లల్లో పళ్లు, ఎముకలు బలంగా ఉండేందుకు ఇవి సాయపడతాయి. గర్భిణీ స్త్రీలలో కనుక విటమిన్‌ ఏ తగినంత లేకపోతే, వారికి పుట్టే పిల్లల్లో అంధత్వం, ఎదుగుదల సరిగా లేకపోవడం.... వంటి అనేక సమస్యలు కలిగే ప్రమాదం ఉంది. వారు కనుక తరచూ వెన్నని తీసుకుంటే, పుట్టే పిల్లల్లో ఇలాంటి సమస్యలు ఏర్పడవంటున్నారు పోషకాహార నిపుణులు.

 

కీళ్ల సమస్యలు రాకుండా!

ఇప్పుడు ఆడామగా, చిన్నపెద్దా అన్న తేడా లేకుండా అందరికీ ఏవో ఒక కీళ్ల సమస్యలు వెంటాడుతున్నాయి. వీటికి విరుగుడుగా పనిచేసే ఒక దివ్యౌషధం వెన్నలో ఉందని తేలింది. వెన్నలో ఉండే ‘Wulzen Factor’ అనే ఒక పోషకం కీళ్ల దగ్గరా, రక్తనాళాలలోనూ కాల్షియం పేరుకుపోకుండా కాపాడుతుందట. పైగా ఇందులో ఉండే డి విటమిన్‌, మన శరీరానికి తగిన కాల్షియం అందేలా సాయపడుతుంది.

 

క్యాన్సర్‌ను సైతం!

వెన్నలో రకరకాల విటమిన్లు, ఖనిజాలు ఎలాగూ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటికి తోడు ఇందులో ఉండే సెలేనియం అనే అరుదైన యాంటీఆక్సడెంట్‌ మనల్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతుందని తేలింది. ఇక వెన్నలో కనిపించే conjugated linoleic acids అనే పదార్థాలు మనల్ని క్యాన్సర్‌ నుంచి రక్షిస్తాయని నిపుణులు సాధికారంగా చెబుతున్నారు.
ఇదీ విషయం! ఇలా చిలుకుతూ పోతే వెన్నతో మరెన్నో లాభాలు ఉన్నాయన్న విషయాలు బయటపడుతూనే ఉంటాయి. కాబట్టి... ఈ కృష్ణాష్టమి నుంచైనా మన నిత్యజీవితంలో ఎంతో కొంత వెన్న ఉండేలా జాగ్రత్త పడదాము.

 

- నిర్జర.