దేశంలో ఒకోచోట ఒకోలా... కృష్ణాష్టమి!

 

శ్రీకృష్ణుడు దేవకి కడుపున పుట్టి ఉండవచ్చు, యశోద ఇంట పెరిగి ఉండవచ్చు, ద్వారకని పాలిస్తూ కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొని ఉండవచ్చు. కానీ ఆయన ఏదో ఒక ఇంటికో, ప్రాంతానికో పరిమితం అయినవాడు కాదు. కోట్లమంది హిందువుల గుండెల నిండా కొలువైనవాడు. అందుకే భారతదేశం యావత్తు ఆయనని తమని తోచినరీతిలో ఆయన పుట్టినరోజుని జరుపుకొంటుంది. వాటిలో కొన్ని ఆసక్తికరమైన సందర్భాలు ఇవిగో...

 

మహారాష్ట్ర

కృష్ణాష్టమి వేడుకల గురించి ప్రస్తావన రాగానే మహారాష్ట్రే గుర్తుకువస్తుంది. అక్కడ జరిగే దహీహండీ (ఉట్టి) కార్యక్రమం అంత ప్రసిద్ధి మరి! అయితే ఇవి సాదాసీదాగా సాగవు. కృష్ణాష్టమికి కొన్ని వారాల ముందు నుంచే ప్రతి పేటలోని కుర్రాళ్లు, ఉట్టి కొట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేస్తారు. కృష్ణాష్టమి సమయానికి వీరంతా ఒక మండలిగా ఏర్పడి.. ఉట్టి కొట్టే పోటీని నిర్వహిస్తారు. ఈ పోటీలలో గెలుపొందిన జట్టుకి బహుమతులు కూడా భారీగానే అందుతాయి.

 

మణిపూర్

మణిపూర్‌ వాసులకు కృష్ణారాధన ఎక్కువే! దాంతో కృష్ణాష్టమి వచ్చిందంటే ఇంఫాల్‌ వంటి చోట్ల ఉన్న కృష్ణుని ఆలయాలు కిటకిటలాడిపోతాయి. ఆ రాష్ట్రానికే ప్రత్యేకమైన మణిపురి నృత్యంలో శ్రీకృష్ణుని రాసలీలలను ప్రదర్శిస్తారు.

 

పశ్చిమబెంగాల్‌

పశ్చిమబెంగాల్‌, ఒడిషాలలో భక్తి ఉద్యమం తర్వాత కృష్ణ భక్తి పరాకాష్టకు చేరుకుంది. చైతన్య మహాప్రభు దగ్గర నుంచి ప్రభుపాదుల వరకు ఆ భక్తిని ప్రచారం చేసినవారెందరితోనో బెంగాల్‌ పునీతమైంది. ఆ ప్రభావం కృష్ణాష్టమి రోజున తప్పక కనిపిస్తుంది. చైతన్యమహాప్రభు జన్మస్థానమైన ‘నవ్‌దీప్‌’ వంటి ప్రదేశాలలో జన్మాష్టమిని ఘనంగా చేసుకుంటారు. కృష్ణుడు రాత్రివేళ పుట్టాడు కాబట్టి, జన్మాష్టమి అర్ధరాత్రి పూజలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఆ మర్నాడు నవమి రోజుని కూడా వీరు పండుగలానే జరుపుకొంటారు.

 

తమిళనాడు

తమిళనాడులో కృష్ణాష్టమి వేడుకలు మన తెలుగువారినే పోలి ఉంటాయి. ఇంటింటా తప్పనిసరిగా కృష్ణపాదాలను పోలిన ముగ్గులు వేస్తారు. చిన్న పిల్లలను బాలకృష్ణునిలా అలంకరిస్తారు. ఇంటింటా ఉపవాసాలు, భాగవత పఠనాలు సాగుతాయి. గీతగోవిందంలోని భావాలకు భరతనాట్యంలో అభినయం చేసే వేడుకలూ కనిపిస్తాయి.

 

కశ్మీర్

జమ్మూకశ్మీర్లో ‘పతంగ్‌బాజీ’ పేరుతో కృష్ణాష్టమి సందర్భంగా గాలిపటాలు ఎగరేస్తారు. కృష్ణుడు పుట్టినందుకు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ సంబరాలు సాగుతాయి. ఈ పతంగ్‌బాజీ వేడుకలు ఈనాటికి కావని చెబుతారు. ఎప్పుడో మహాభారత కాలం నుంచే కశ్మీర్‌వాసులు ఈ వేడుకను నిర్వహిస్తున్నారట.

 

కృష్ణాష్టమి వేడుకలు కేవలం మన దేశంలోనే కాదు... ప్రపంచంలో హిందువులు ఉండే ప్రతి ప్రాంతంలోనూ వేడుకగా సాగుతాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 600కు పైగా ఉన్న ఇస్కాన్‌ ఆలయాలలో కృష్ణాష్టమి ఘనంగా జరుగుతుంది.

- నిర్జర