డొక్కు పడవల్లో సేఫ్‌గా యమలోకానికి..?

గోదావరి తీరాన పాపికొండలు, కృష్ణా-గోదావరి సంగమ స్ధానం, నిత్యమూ పచ్చదనంతో అలరారే కోనసీమ.. అరకు అందచందాలు... ఇలా ఒకటేమిటీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకానికి అనువుకానీ ప్రదేశమే లేదంటే అతిశయోక్తి లేదు.. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఆదాయ మార్గాలను కోల్పోయిన నవ్యాంధ్రకు లోటును పూడ్చే ఆదాయవనరుల్లో పర్యాటకం కూడా ఒకటిగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా టూరిజాన్ని ప్రొత్సహించే ఎన్నో ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. వీటిలో ప్రధానమైనది రివర్ టూరిజం.

 

గోదావరిలో ఉన్న పాపికొండలకు తోడు కృష్ణానదిలోనూ ఈ రివర్‌ టూరిజాన్ని అభివృద్ది చేయాలని సంకల్పించింది ప్రభుత్వం. అందుకు తగ్గట్టే ఆయా ప్రాంతాల్లో ఘాట్లు, రిసార్టుల వంటి సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి వీటిపై విస్తృత ప్రచారం కల్పించింది. ప్రభుత్వ కృషి ఫలించి ఇప్పుడిప్పుడే పర్యాటకుల తాకిడి పెరుగుతున్న వేళ నిన్న విజయవాడ సమీపాన కృష్ణానదిలో జరిగిన పడవ ప్రయాణం పర్యాటకుల భద్రతను ప్రశ్నిస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది మరణించారు.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర జలరవాణా వ్యవస్థలోని లోపాలు వెలుగులోకి వస్తున్నాయి.

 

ప్రస్తుతం మనరాష్ట్రంలో జలరవాణా, జలవిహారానికి ఉపయోగిస్తున్న లాంచీలు, మరపడవలు, నాటు పడవలు, బల్లకట్లు, పుట్టీలు పాతకాలం నాటివి.. దానికి తోడు కాసుల కోసం పరిమితికి మించి రెట్టింపు సంఖ్యలో ప్రయాణికుల్ని వాటిలోకి ఎక్కిస్తున్నారు. ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి ఉపయోగించే లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్ వంటి పరికరాలు ఉండటం లేదు. బల్లకట్లు, బోట్లు పాతకాలపు ఇంజిన్లతోనే నడుస్తాయి. బల్లకట్టపైన పరిచే ఇనుపరేకులు కిందకు ఒంగిపోయి ఉంటాయి. ఒడ్డుకు చేరుకునే సమయంలో వాటి ఒరవడిని నియంత్రించేందుకు తగ్గ ఏర్పాట్లు ఉండవు.. దానికి తోడు ఇంజిన్లు పాడై బల్లకట్లు నది మధ్యలోనే నిలిచిపోవడం, నదుల్లో నీటిమట్టం తగ్గినప్పుడు రాళ్లు తగిలి బల్లకట్లు కొన్ని గంటలపాటు నది మధ్యలోనే ఆగిపోయిన ఘటనలు ఎన్నో ఎన్నెన్నో.

 

ఇందుకు ఒక్కటే పరిష్కారం పాతకాలం నాటి బోట్లు, లాంచీల స్థానంలో విదేశాల్లో వాడుతున్న అధునాతన లాంచీలు తీసుకురావాలి.. జలరవాణాపై ప్రభుత్వ నియంత్రణ పెరగాలి. అనుభవం లేని వారిని పడవ నడిపేందుకు అనుమతించరాదు.. అలా చేస్తే అయినా ఇటువంటి ప్రమాదాలను నివారించినట్లు అవుతుంది.