కృష్ణా జిల్లా టీడీపీ పుట్టి మునగడం ఖాయమా ?

 

ఏపీ ఎన్నికల ముందు వరకూ బాగానే ఉన్న బెజవాడ తెలుగు తమ్ముళ్ళు ఎన్నికల ఫలితాల అనంతరం కొట్టుకోవడం మొదలు పెట్టారు. ఎక్కడ చెడిందో తెలీదు కానీ విజయవాడ ఎంపీ కేశినేని ఆ పార్టీ ఎమ్మెల్సీ విజయవాడ టీడీపీ అధ్యక్ష్యుడు బుద్దా వెంకన్నలు ఒకరి మీద ఒకరు ట్విట్టర్ వేదికగా విమర్శించుకున్నారు. ఒకానొక సందర్భంలో వీరిద్దరూ చేసిన ట్వీట్‌లు టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా తలనొప్పి తెప్పించాయి. 

అయితే ఈ వ్యవహారాన్ని అధిష్టానం సీరియస్‌ గా తీసుకోవడంతో వెనక్కి తగ్గినా బుద్దా వెంకన్న కేశినేని గురించి ట్వీట్స్ చేయడం పూర్తిగా మానేశారు. ఆ తర్వాత కేశినేని కొద్ది రోజులు డోస్ పెంచి మరీ ట్వీట్స్ చేశారు. అయితే ప్రస్తుతానికి ఆపినా ఆ వివాదం పూర్తిగా చల్లబడని కారణంగా విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షునిగా వచ్చే టర్మ్ నుంచి ఉండబోనని బుద్దా వెంకన్న తేల్చిచెప్పేశారు. 

ఈ రోజు కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా పార్టీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు పలువురు ముఖ్యనేతలు కూడా డుమ్మా కొట్టారు. అయితే ఈ సమావేశానికి హాజరైన బుద్దా వెంకన్న మాత్రం దానిని అవమానంగా ఫీల్ అయ్యారో ఇంకేమన్నానో కానీ తనకి మళ్ళీ ఎటువంటి పదవులు వద్దని తేల్చేసి భవిష్యత్‌లో ఎవరికి ఆ పదవి వచ్చినా తాను అన్ని విధాలా సహకరిస్తానన్న అభిప్రాయాన్ని సమావేశంలో వెల్లడించి బుద్దా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు. 

అయితే ఈ విషయం అలా ఉంచితే పార్టీలో కీలక నేతలు అయిన బొండా ఉమా, వంశీలు పార్టీ వీడుతున్నారు అని ప్రచారం మొదలయ్యింది. ఉమా పార్టీ మారుతున్నట్టు రెండ్రోజుల క్రితమే ప్రచారం మొదలయ్యిది. ఆయన అందుకే ఏమీ తగ్గకుండా న్యూజీల్యాండ్ లో ఎంజాయ్ చేస్తూ తన మీద వస్తున్న ఈ వార్తలను కూడా ఆస్వాదిస్తున్నారు. ఆయన పార్టీ వీడడం ఖాయమయినా అది వైసీపీనా, బీజేపీనా అనేది క్లారిటీ లేదు. 

ఇక తాజా సమావేశానికి వల్లభనేని వంశీ కూడా డుమ్మా కొట్టడంతో ఆయన మీద కూడా వార్తా కధనాలు మొదలయ్యాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే టీడీపీ అధికారంలోకి వస్తుంది వచ్చాక ఎమ్మెల్సీ అయినా ఇవ్వకపోతారా అనే ఆశతో పార్టీలో చేరిన దివంగత కాపు నేత రంగా కుమారుడు రాధా పరిస్థితి చుక్కాని లేని నావలా తయారయ్యింది. టీడీపీలో ఆయన పరిస్థితి మింగలేక కక్కలేక ఉన్నట్టుంది. 

ఆయన టీడీపీలో చేరడం ఎంతో మంది వ్యతిరేకించినా ఆయన వచ్చి చేరారు. ఇప్పుడేమో ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పార్టీని తద్వారా పార్టీలోని నేతల ఇమేజ్ ని దెబ్బ తీస్తోంది. ముందు ముందు అధినేత జిల్లా రాజకీయాల మీద ద్రుష్టి పెట్టకుంటే కంచుకోట అని చెప్పుకునే జిల్లా ఇప్పటికే ఒకసారి వైసీపీ పరం కాగా భవిష్యత్తులో కోలుకోలేని విధంగా దెబ్బ పడడం ఖాయం. ఇప్పటికే జిల్లా అధ్యక్ష్యుడుగా బచ్చుల అర్జునుడు ఉన్నా అధికారం మాత్రం దేవినేని చేతిలోనే ఉంటుందనేది బహిరంగ రహస్యమే. మరి ఆయన అయినా ఈ విషయాన్ని పట్టించుకోకుంటే జిల్లాలో పార్టీ పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తోంది.