ఏపీ సీఎం జగన్ పై కోట శ్రీనివాసరావు సెన్సేషనల్ కామెంట్స్ 

టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు తన పుట్టిన రోజు సందర్బంగా కొన్ని మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా తాను గతంలో బిజెపి తరుఫున విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాను మాజీ ప్రధాని వాజ్ పేయికి అభిమానిని అని, అందుకే తనను బిజెపిలోకి తీసుకున్నారని అన్నారు. ఇదే సమయంలో అనేక విషయాల పై మాట్లాడిన కోటా రాజకీయాల పై మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భం లో ఆయన ఏపీ సీఎం జగన్ పై కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను పాత సామెతలను నమ్ముతానని, అందులో ఒక సామెత ప్రకారం ఇప్పుడు ఆంధ్రలో పరిస్థితి ఎలా ఉందంటే "నిద్రపోయేవాడిని లేపవచ్చు గానీ నిద్ర నటించేవాడిని లేపలేమని కోట శ్రీనివాస రావు అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలన్నీ సీఎం జగన్ కు తెలియకుండానే జరగుతున్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఐతే అలా ఎందుకు జరుగుతుందో మాత్రం తెలియడం లేదని ఆయన అన్నారు. ఐతే అంతకు మించి మాట్లాడడానికి మాత్రం కోట ఇష్ట పడలేదు.

అదే సమయంలో తాను తెలంగాణ గురించి మాట్లాడబోనని, ఐతే ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం మాట్లాడుతానని ఎందుకంటే తనకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హత ఉందని, అక్కడ తాను గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశానని ఆయన అన్నారు. తన స్వగ్రామం కంకిపాడు విజయవాడ పక్కనే ఉందని అక్కడ తనకు ఇప్పటికి ఆస్తులు ఉన్నాయని, అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతానని ఆయన అన్నారు. అది కూడా ఒకే ఒక మాటలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంభవిస్తున్న పరిస్థితిపై మాట్లాడుతానని అంటూ ఆయన స్పష్టం చేశారు.