బీజేపీకి అంత సీన్ లేదు.. చేజేతులారా మేమే చేసుకున్నాం!!

 

తెలంగాణ లో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకి దిగజారుతున్నట్టుగా మారుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ తో పార్టీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లోకి జంప్ చేయడంతో పార్టీలో స్తబ్దత ఏర్పడింది. మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికలలో మూడు ఎంపీ సీట్లు గెలిచినప్పటికీ ఇంతకు  ముందున్న జోష్ పార్టీ వర్గాలలో కనిపించడం లేదు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం పై చేసే విమర్శలు తప్ప కాంగ్రెస్ నాయకుల నుండి స్పందన కరువైంది. ఒక పక్క కాంగ్రెస్ అధిష్టానం లో నెలకొన్న అయోమయ పరిస్థితికి తోడు రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో అసలు తెలంగాణాలో కాంగ్రెస్ ఉందా లేదా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఇది ఇలా ఉండగా రాష్ట్రం లో 4 ఎంపీ స్థానాలు గెల్చుకున్న తరువాత బీజేపీ నాయకుల హల్చల్ ఎక్కువైంది. తాజాగా ఈ విషయం పై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందిస్తూ తెలంగాణ లో బీజేపీకి అంత సీన్ లేదని ఇదంతా కాంగ్రెస్ చేజేతులారా చేసుకున్న పొరపాట్ల వల్లనే ఓటమి పాలయ్యామని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా 2024లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాము గట్టిగా కృషి చేస్తామని తెలిపారు. ఈనెల 26 నుంచి తాను నార్కెట్ పల్లి నుంచి పాదయాత్ర చేపట్టబోతున్నట్లు అయన తెలిపారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, కోమటిరెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్రను సక్సెస్ చేయాలని కోరారు. అదే సమయంలో బీజేపీ పై పంచ్ లు వేస్తూ ఆ పార్టీ చేసేది అంతా హడావిడి మాత్రమేనని కానీ విషయం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి తోకపార్టీలా మారిందని విమర్శించారు.