టీ కాంగ్ : ఆలూ లేదూ చూలూ లేదు... సామెత నిజం చేస్తోందా?

 

దేశంలో ఎన్ని పార్టీలున్నా కాంగ్రెస్ కాంగ్రెస్సే! అత్యంత పురాతన పార్టీ అయిన హస్త దళం క్రమంగా కుంచించుకుపోతోంది. మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న మరుక్షణం నుంచీ ఓటములు మరింత ఎక్కువయ్యాయి. త్వరలో గోవా, పంజాబ్, మణిపూర్ లలో అధికారంలోకి వస్తే ఆ పార్టీకి కొంత ఊరట. కాని, దేశంలోని చాలా చోట్ల మాత్రం కాంగ్రెస్ కహానీ ఖతమయ్యే స్థితిలో వుంది. అయినా కూడా కాస్త ఆశలు పెట్టుకోగల రాష్ట్రం మన తెలంగాణ. ఇప్పుడు ప్రతిపక్షంలో వున్నా రేపో, మాపో అధికారం కాంగ్రెస్ కు చిక్కే ఛాన్స్ ఇక్కడ వుంది! కాని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు యథా ప్రకారం తమ అంతర్గత వర్గ పోరుల్లో హస్త లాఘవం ప్రదర్శిస్తున్నారు. జనం అధికారం ఇద్దామనుకున్నా వీళ్లే వాళ్లకు వణుకు పుట్టించేలా వున్నారు...

 

తెలంగాణ ఏర్పాటు తరువాత తామే పవర్ లోకి వచ్చేస్తామని కలలుగన్నారు టీ కాంగ్ నేతలు. జానా రెడ్డి మొదలు గీతా రెడ్డి వరకూ అందరూ ఎవరికి వారు సీఎంలు కూడా అయిపోయారు. ఇలా బోలెడు మంది కాంగీ అగ్ర నేతలు కలల కాన్వాయ్ లో ఊరేగుతుండగానే ఎన్నికలు ముగిశాయి. జనం కేసీఆర్ ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని చేశారు! ఇందుకు కారణం, ఆయన ఉద్యమ నాయకుడిగా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకోవటం ఒక్కటే కాదు... తెలంగాణ కాంగ్రెస్ నేతల నిర్వాకం కూడా! వాళ్లలో ఏ ఒక్కరూ జనంలో నమ్మకం తీసుకురాలేకపోయారు. ప్రతిపక్ష హోదానిచ్చిన తెలంగాణ ఓటర్లు అధికారం మాత్రం కట్టబెట్టలేదు.

 

సోనియా తెలంగాణ ఇచ్చినా కూడా రాష్ట్రంలో అధికారానికి దూరం కావటం స్థానిక నేతల అసమర్థతే అనవచ్చు. ఇప్పుడు అదే మరోసారి టీ కాంగ్రెస్ పుట్టి ముంచబోతున్నట్టు కనిపిస్తోంది. ఇంకా ఎన్నికలకి రెండు సంవత్సరాలు సమయం వున్నా కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నాలేవీ ఉత్తర్ కుమార్ రెడ్డి బ్యాచ్ చేస్తున్నట్టు కనిపించటం లేదు. పైగా ఈ మధ్య కాంగ్రెస్ వారికి సహజమైన అంతర్గత పోరుతో వార్తల్లో నిలిచారు! ఒకవైపు ఉత్తమ్ తన సర్వే తాను చేయించుకుని 55సీట్లు ఖాయమని ప్రచారం చేయించారు. దానిపై మండిపడాల్సిన గులాబీ పార్టీ కంటే ఎక్కువగా చెలరేగిపోయారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఒకే కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య గొడవ మనకు తెలియంది కాదు. ఉత్తమ్ టీపీసీసీ చీఫ్ అయిన రోజు నుంచీ వెంకట్ రెడ్డి తిరుగుబాటు చేస్తూనే వున్నారు. తాజా సర్వేలో కూడా తన ప్రాంతమైన నకిరేకల్ లో కాంగ్రెస్ ఓడుతుందని ఉత్తమ్ వర్గం అనటం ఆయనకి విపరీతమైన కోపం తెప్పించింది. వెంటనే మీడియా ముందుకొచ్చి గడ్డాలు, మీసాలు పెంచితే కాంగ్రెస్ గెలవదని కుండ బద్ధలు కొట్టాడు!

 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... ఉత్తమ్ మీద కోపంతో గడ్డాలు, మీసాలు వేస్ట్ అని వుండవచ్చు కాని... అది నిజం కూడా! కేసీఆర్ లాంటి అపర చాణుక్యుడి ధాటికి తట్టుకుని అధికారంలోకి రావాలంటే చాలా తెలివితేటలు, ఐకమత్యం, పట్టుదల అన్నీ వుండాలి. తెలంగాణ కాంగ్రెస్ లో అలాంటివేం ఇప్పటికైతే పొడసూపటం లేదు. ఉత్తమ్ , కోమటిరెడ్డి వర్గాలు కొట్టుకుంటుంటే సీనియర్లు దాదాపూ మౌనం వహించేశారు. యథా ప్రకారం ఢిల్లీలో మోదీ దెబ్బకు అల్లాడుతున్న హైకమాండ్ కు విషయమంతా చేరవేశారు. వాళ్లు తెలంగాణ కాంగ్రెస్ రచ్చపై దృష్టి పెట్టేది ఎప్పుడు? పరిష్కారం చూపేది ఎప్పుడు? అంతలోపు ఇక్కడ టీఆర్ఎస్ ను అడ్డుకునేది ఎవరు?

 

ఒక్కొక్కటిగా చేజారుతోన్న రాష్ట్రాల్లో తెలంగాణను కూడా కలపొద్దనుకుంటే కాంగ్రెస్ హైకమాండ్ అర్జెంట్ గా తెలంగాణ శాఖని ప్రక్షాళన చేయాలి. అందరికీ అమోదయోగ్యమైన బలమైన నేతని సారథిగా నియమించాలి. లేదా వున్న లీడర్ నే అందరూ ఫాలో అయ్యేలా చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప కాలయాపన చేస్తే ఆంధ్రాలో లాగే తెలంగాణలో కూడా ఖాళీ చేయి మిగలటం పెద్ద సుదూర విషయమేం కాదు... హస్తం పార్టీకి!