ఎరుపు నుంచి కాషాయానికి రంగు మారుతోన్న మమత పాలిటిక్స్!

 

మూడు దశాబ్దాల లెఫ్ట్ అధికారానికి బెంగాల్లో పెద్ద బెంగగా మారింది దీదీ. మమత బెనర్జీ వరుసగా రెండు సార్లు ఎర్రదండుని ఓడించి కొత్త ఎనర్జీతో వుందిప్పుడు. అక్కడ ఇప్పుడప్పుడే సీపీఎం, దాని సహచర పార్టీలు లేచి నిలబడే పరిస్థితి లేదు. అంతగా పాతాళానికి తొక్కేసింది మమతమ్మ. కాని, బెంగాల్లో తిరుగులేకుండా పోయిన బెనర్జీకి కంటీ మీద నిద్దుర మాత్రం వుండటం లేదు. అందుక్కారణం... బీజేపీ, అరెస్సెస్ లే! ఆమె ఎర్ర పార్టీలకు తాగించిన కషాయమే ఆమెకు కాషాయ దళం తాగిస్తుందేమో అని మమత తెగ బెంబేలెత్తుంది!

 

నోట్ల రద్దు తరువాత దేశంలో నిర్భయంగా నోరెత్తిన ఇద్దరు సీఎంలలో మమత ఒకరు. అరవింద్ కేజ్రీవాల్ మోదీని తిట్టిపోయటం కొత్త కాదు కాబట్టి మమత చేసిన హంగామానే అసలు విశేషం. అసలు ఎంత మాత్రం జంకు లేకుండా ఆమె డీమానిటైజేషన్ని వ్యతిరేకించింది. జనం మోదీ నిర్ణయాన్ని పెద్ద ఎత్తున సమర్థిస్తున్నారని తెలిసి కూడా ఆమె మోదీతో పోరుకు సిద్ధమైంది. చివరకు, భారతీయ సైన్యం ఆమె రాష్ట్రంలో కాలుపెడితే కూడా తన ప్రభుత్వాన్ని అస్థిర పరచటానికి కంటూ ఆరోపణలు చేసి అందర్నీ షాక్ కి గురి చేసింది. మమత తన రాజకీయం కోసం ఆర్మీని కూడా వాడుకోవటం చాలా మంది జీర్ణించుకోలేకపోయారు.

 

నోట్ల రద్దుని వ్యతిరేకించటం వెనుక మమత ఉద్దేశాలు, దురుద్దేశాలు ఎవ్వరికీ తెలియవు. శారదా స్కామే కారణమని కొందరంటున్నా ఆ విషయం కోర్టులో తేలాల్సిందే. కాని, కాస్త లోతుగా చూస్తే ఆమె అభ్రదత బీజేపి ప్రభావం పెరగటం గురించే అని మనకు అర్థమైపోతుంది. చాలా పెద్ద ఎత్తున ముస్లిమ్ జనాభ వున్న బెంగాల్ లో బీజేపి, అరెస్సెస్ ఎదుగుదలకి అవకాశాలు పుష్కలంగా వున్నాయి. అంతే కాదు, లెఫ్ట్ పార్టీల పతనంతో అక్కడ చాలా రాజకీయ శూన్యం కూడా వుంది. మమత అంటే ఇష్టం లేని ఓటర్లు లెప్ట్ ని కాకుండా బీజేపిని ఎంచుకుని అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే టర్మ్ కల్లా మమత అధికారం కోల్పోయేటంత ప్రమాదం లేదనే ఇప్పుడు మనకు అనిపిస్తోంది. కాని, మోదీ, అమిత్ షా రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కల్లా పూర్తి స్థాయిలో దృష్టి పెడితే మమతకు గండం తప్పక పోవచ్చు. అదీ కాక బీజేపి, అరెస్సెస్ ఎంతగా బలపడితే దీదీకి అంతగా అధికారం నిలబెట్టుకోవటం కష్టమవుతూ వుంటుంది. హిందువులు ఒక్కసారి పెద్ద ఎత్తున కమలం వైపు కదిలితే తరువాత ఆమె చేయగలిగింది ఏమీ లేదు.

 

బీజేపి, అరెస్సెస్ రెండు వైపుల నుంచి ముంచుకొస్తుండటంతో మమత తీవ్రంగానే ఒత్తిడికి లోనవుతున్నట్టు కనిపిస్తోంది. మోదీపై ఆమెకు సన్నిహితుడైన ముల్లా ఒకరు ఫత్వా జారీ చేసినా ఆమె ఏమీ అనకపోవటం ఆమె భయానికి స్సష్టమైన సంకేతం. అందుకే, అంతకంతకూ ముస్లిమ్ ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. కాని, ఆ క్రమంలో ఆమె బీజేపి, అరెస్సెస్ తో కాకుండా ఏకంగా బెంగాలీ హిందూ సమాజంతో గొడవకు దిగుతున్నట్టు అనిపిస్తోంది. వరుసగా హిందువులపై దాడులు జరగటం, కనీసం దుర్గా పూజలు కూడా స్వేచ్ఛగా చేసుకోలేకపోవటం... ఇవన్నీ దీర్ఘ కాలంలో మమత మీద హిందువులకున్న ఇప్పటి మమత తగ్గేలా చేసేవే! అదే బీజేపీకి అరెస్సెస్ కి కావాల్సింది కూడా!

 

సంక్రాంతి సందర్భంగా అరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ మీటింగ్ ఏర్పాటు చేశారు కోల్ కతాలో. దాన్ని అందరూ ఊహించినట్టుగానే పోలీసుల ద్వారా అడ్డుకున్నారు మమత. ఒక మైదానం చిన్నదవుతుందని సాకు చెప్పారు పోలీసులు. రెండోది పెద్దదవుతుందని, అంత ప్రాంతానికి పోలీసుల్ని ఏర్పాటు చేయలేమని చేతులెత్తేశారు. చివరకు, హై కోర్ట్ ను ఆశ్రయించారు అరెస్సెస్ వారు. ఒకవేళ మమత మొండితనాన్ని దెబ్బతీస్తూ హైకోర్ట్ అనుమతి ఇస్తే అది దీదీకి అవమానమే. ఎందుకంటే, గతంలోనూ అమిత్ షా సభకి మమత ఒప్పుకోకున్నా కోర్ట్ అంగీకరించింది. మోహన్ భాగవత్ రాజకీయ పార్టీకి చెందిన వారూ కూడా కాదు కాబట్టి కోర్టు ఒప్పుకునే సూచనలే ఎక్కువ!

 

మమత అరెస్సెస్, బీజేపీలతో కయ్యానికి కాలుదువ్వి ముస్లిమ్ ఓటు బ్యాంకు పటిష్ఠం చేసుకోగలదేమోగాని హిందువులు ఎల్లప్పుడూ ఆమె వెంట వుంటారని గ్యారెంటీ లేదు. ఒకప్పుడు వాళ్లే ముప్పై ఏళ్లు లెఫ్ట్ పార్టీల్ని నెత్తిన పెట్టుకున్నారు. తరువాతని మమతపై మమకారాన్ని కురిపించారు. మరి ముందు ముందు కమలాన్ని వికసింపజేయరని విశ్వాసం ఏంటి? సెక్యులరిజమ్ ట్రాప్ లో చిక్కి మమత మెజార్జీ ఓట్లకు దూరం కాకపోవటమే ఆమె భవిష్యత్ కు భరోసా. లేదంటే కాషాయ గండం తప్పకపోవచ్చు....