ఒక పరాజయం 100 తప్పులు.. కోడికత్తి టీడీపీకే దిగిందా?

 

ఒకప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద రాజకీయపరమైన విమర్శలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. నాయకులు ఒక్కరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. దీనికి టీడీపీ కూడా మినహాయింపు కాదు. ఓ రకంగా టీడీపీ ఘోర పరాజయానికి ఈ వ్యక్తిగత విమర్శలు కూడా కారణమని చెప్పవచ్చు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మీద పదేపదే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తుండేది. అదే టీడీపీ కొంపముంచింది. జగన్ అప్పటికే అవినీతి ఆరోపణల కేసుల కేసులో ఏడాదికి పైగా జైలులో ఉన్నారు. జగన్ ని అప్పటి కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా జైలుకి పంపిందని అప్పటికే వైసీపీ శ్రేణుల్లో అభిప్రాయం ఉంది. దానికి తోడు.. తరువాత ఆయన అధికారంలోకి వచ్చేవరకు యాత్రల పేరుతో ప్రజల్లోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన్ను 'ఏ1' అంటూ పదేపదే టీడీపీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేయడంతో.. ప్రజల్లో జగన్ మీద తెలీకుండానే సానుభూతి ఏర్పడింది.

అదేవిధంగా విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి విషయంలో కూడా టీడీపీ నోరు పారేసుకుంది. బాబూ రాజేంద్ర ప్రసాద్ వంటి నేతలైతే.. జగన్ మీద ఆయన తల్లో, చెల్లెలో దాడి చేసి ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు మిగతా టీడీపీ నేతలు కూడా 'కోడి కత్తి.. కోడి కత్తి' అంటూ జోకులేసారు. అక్కడ దేనితో దాడి జరిగిందనేది కాదు.. ఎవరి మీద దాడి జరిగిందనేది ముఖ్యం. ఓ ప్రతిపక్ష నేత దాడి మీద జరిగితే.. అధికార పార్టీ నేతలు మాట్లాడాల్సిన మాటలేనా అవి?. అలా కోడి కత్తి అంటూ నోరు పారేసుకుని, జగన్ మీద సానుభూతి పెంచారు. తమ పార్టీ మీద వ్యతిరేకత పెంచుకున్నారు. ఓ రకంగా గత ఐదేళ్లల్లో టీడీపీ తమ ప్రభుత్వం చేస్తున్న, చేయబోతున్న అభివృద్ధి గురించి చెప్పడం కంటే.. జగన్ మీద విమర్శలు చేయడానికే ఎక్కువ సమయం వెచ్చించింది. ఇప్పుడు ఫలితం అనుభవిస్తుంది.