ఒక పరాజయం 100 తప్పులు.. కోడెల ట్యాక్సే కొంప ముంచిందా?

 

టీడీపీ ఘోర పరాజయంలో పలువురు నేతలు కీలక పాత్ర పోషించారు. వారిలో ముఖ్యంగా మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు గురించి చెప్పుకోవాలి. అసలు కోడెలను స్పీకర్ పదవికి ఎంపిక చేసి చంద్రబాబు తప్పు చేశారంటూ అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. రాజ్యాంగ బద్దమైన స్పీకర్ పదవికి నెమ్మదస్తులను, ఆచి తూచి మాట్లాడేవారిని ఎంపిక చేయకుండా.. దూకుడు స్వభావం ఉన్న కోడెలను ఎంపిక చేయడం ఏంటని బాబు నిర్ణయాన్ని పలువురు తప్పుపట్టారు. అయితే స్పీకర్ పదవి చేపట్టాక కోడెల దూకుడు కాస్త తగ్గిందేమో కానీ ఆయన కుటుంబం మాత్రం రెచ్చిపోయింది. ఆయన కుటుంబం పుణ్యమా అని గుంటూరు జిల్లాలో టీడీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.

నాయకుడు అనేవాడు ప్రజలకు అండగా ఉండాలి, అవసరానికి ఆదుకోవాలి. కానీ కోడెల కుటుంబం ప్రజలను అందిన కాడికి దోచుకుంది. నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల టాక్స్ పేరుతో ఆయన కొడుకు, కూతురు ప్రజలను పీక్కుతిన్నారు. ఆఖరికి సొంత పార్టీ కార్యకర్తలను కూడా వదలకుండా వసూళ్లకు దిగారు. దీంతో ఇటు పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజల్లోనూ కోడెల కుటుంబం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ ప్రభావం టీడీపీ మీద పడింది.

నిజానికి కోడెల కుటుంబ ఆగడాలు ఎన్నికలకు ముందే చంద్రబాబు దృష్టికి వచ్చాయి. కానీ బాబు కోడెల కుటుంబాన్ని అదుపు చేసే ప్రయత్నం చేయలేదు. సీనియర్ నేత అని కోడెలని ప్రశ్నించలేకపోయారో, లేక తనని చూసి అన్ని నియోజకవర్గాల ప్రజలు టీడీపీకే ఓట్లేస్తారు అనుకున్నారో తెలీదు కానీ.. బాబు మాత్రం ఈ విషయంలో కోడెల కుటుంబాన్ని అదుపు చేయలేదు. అదే ఎన్నికల్లో బాబు కొంపముంచింది.